వెన్నెల కిషోర్.. ‘సాహో’ సర్ప్రైజ్

Update: 2017-12-10 09:33 GMT
వెన్నెల కిషోర్ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకుల ముఖాలపై ఆటోమేటిగ్గా చిరునవ్వు పులుముకుంటుంది. ఒకప్పుడు బ్రహ్మానందం ఎలా అయితే.. జనాల్ని ఉర్రూతలూగించాడో.. ఇప్పుడు కిషోర్ అదే తరహాలో అలరిస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్ అతడే. బ్రహ్మి లాగే కిషోర్ ను కూడా కామెడీలో కాకుండా వేరే పాత్రల్లో ఊహించుకోవట్లేదు తెలుగు ఆడియన్స్. గత కొన్నేళ్లలో కిషోర్ అలాంటి చిలిపి పాత్రలు పోషించాడు. తెరమీద అతడిని చూడగానే జనాలకు నవ్వొచ్చేస్తోందిప్పుడు. ఐతే కిషోర్ ఈసారి అలా నవ్వించే పాత్ర చేయట్లేదట. ఒక సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట ఈ స్టార్ కమెడియన్. ఆ సినిమా మరేదో కాదు.. సాహో.

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ రూపొందిస్తున్న ‘సాహో’లో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఐతే అందులో అతడిది రెగులర్ క్యారెక్టర్ కాదంటున్నారు. ఇప్పటిదాకా కామెడీ పాత్రలే చేస్తూ వచ్చిన కిషోర్.. తొలిసారిగా పూర్తి స్థాయి సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నాడట. ఈ పాత్రలో కొంత చమత్కారం కూడా ఉన్నప్పటికీ.. చాలా వరకు అది సీరియస్ గానే సాగుతుందట. ఇందులో హీరో దొంగ తరహా పాత్ర చేస్తుంటే.. కిషోర్ అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. ఈ సినిమాలో ఇదో సర్ప్రైజ్ అని.. కిషోర్ పాత్ర చూసి థ్రిల్లవుతారని అంటున్నాయి యూనిట్ వర్గాలు. యువి క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News