వీడియో: తేనె పలుకుల అమ్మాయితో బింబిసారుడి ఆటా పాటా..!

Update: 2022-07-23 13:44 GMT
'ఎంత మంచివాడవురా' ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ''బింబిసార'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని కథ ఆధారంగా ఈ టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ తెరకెక్కింది.

'బింబిసార' సినిమాని ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ - ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవలే 'ఈశ్వరుడే' అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా 'ఓ తేనె పలుకుల' అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

'ఓ తేనె పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి.. లాగిందే..' అంటూ సాగిన ఈ ఫోక్ మెలోడీ ఆకట్టుకుంటోంది. ప్రత్యేకమైన సెట్ లో కళ్యాణ్ రామ్ మరియు హీరోయిన్ కేథరిన్ థ్రెసా లపై చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కలర్ ఫుల్ గా ఉంది. దీని కోసం బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

ప్రధాన జంట సాంగ్ నేపథ్యానికి సరిపడే కాస్ట్యూమ్స్ లో అందంగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ సింపుల్ సిగ్నేచర్ స్టెప్పులతో ఆకట్టుకుకున్నారు. 'బింబిసార' చిత్రానికి చిరంతన్ భట్ పాటలు సమకూరిస్తే.. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందించారనే సంగతి తెలిసిందే.

అయితే 'ఓ తేనె పలుకుల అమ్మాయి' పాటకు మాత్రం వరికుప్పల యాదగిరి స్వరాలు ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు.. సాహిత్యం అందించారు. హైమత్ మహ్మద్ మరియు సత్య యామిని కలిసి ఈ జానపద శైలి మెలోడీ గీతాన్ని ఆలపించారు.

''బింబిసార'' చిత్రంతో వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశారు. సంయుక్త మీనన్ - వారీనా హుస్సేన్ వంటి మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉన్నారు.

కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఛోటా కె నాయుడు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.


Full View
Tags:    

Similar News