నోట విడుదల తేదీ..చాలా మంచి నిర్ణయం

Update: 2018-09-07 05:36 GMT
‘అర్జున్‌ రెడ్డి’ - ‘గీత గోవిందం’ చిత్రాల తర్వాత టాలీవుడ్‌ లో విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరోగా మారిపోయాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్‌ నుండి రాబోతున్న ‘నోటా’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ చిత్రంకు తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు కూడా తమిళంలో మంచి స్టాండ్‌ దక్కలేదు. తమిళ హీరోలు తెలుగులో దున్నేస్తున్న ఈ సమయంలో తెలుగు హీరోలు మాత్రం అక్కడ కిందా మీదా పడుతున్నారు.

ఈమద్య కాలంలో ‘స్పైడర్‌’ చిత్రంతో మహేష్‌ బాబు అక్కడ గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నం చేశాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు నటించిన సినిమా అయినా కూడా అక్కడ ప్రేక్షకులు ఆధరించలేదు. తమిళంలో ఇప్పటి వరకు ఏ ఒక్క టాలీవుడ్‌ హీరో కూడా స్టార్‌ డంను దక్కించుకోలేక పోయారు. ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండ అక్కడకు వెళ్లడం అందరికి ఆశలు కలిగిస్తుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ లక్‌ మామూలుగా లేదు. ఏం చేస్తే అది సక్సెస్‌ - ఏది పట్టుకుంటే అది బంగారం అన్నట్లుగా ఆయన టైం నడుస్తుందని - అందుకే తమిళంలో కూడా ఈ చిత్రంతో స్టార్‌ డంను దక్కించుకుంటాడనే నమ్మకంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘నోటా’ చిత్రం విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకున్న నిర్ణయం కూడా విజయ్‌ దేవరకొండ సక్సెస్‌ కు కారణం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

‘నోటా’ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి అక్టోబర్‌ 4న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ‘నోటా’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సీఎంగా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం తమిళ తళపతి విజయ్‌ - మురుగదాస్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కార్‌’. ఈ చిత్రంలో విజయ్‌ కూడా సీఎంగా కనిపించే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఒకవేళ విజయ్‌ ‘సర్కార్‌’ తర్వాత ‘నోటా’ విడుదలైతే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. సర్కార్‌ కంటే ముందే విజయ్‌ దేవరకొండ రావడం వల్ల ప్రేక్షకులు ఆధరించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్‌ ‘సర్కార్‌’ చిత్రంను దీపావళి సందర్బంగా విడుదల చేయబోతున్నారు. సర్కార్‌ కంటే నెల రోజుల ముందు ‘నోటా’ విడుదల కాబోతుండటంతో అక్కడ నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగులో కూడా దసరాకు ముందు విడుదల చేయడం వల్ల మంచి వసూళ్లు సాధ్యం అవుతాయనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి అక్టోబర్‌ 4న విడుదల చేయడం అనేది ‘నోటా’కు తెలుగు మరియు తమిళంలో కలిసి వస్తుందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.
Tags:    

Similar News