బెల్లంకొండ శ్రీను.. గుండెజారి గల్లంతయ్యింది

Update: 2015-11-14 09:30 GMT
‘అల్లుడు శీను’ లాంటి మాస్ మసాలా సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. అతడి బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే తొలి సినిమాకు తెచ్చుకున్న హైప్ - పేరు ఆశ్చర్యపరిచేవే. అతడి రెండో సినిమా తమిళ సూపర్ హిట్ ‘సుందరపాండ్యన్’కు రీమేక్. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా బెల్లంకొండ సురేష్ ఫైనాన్స్ కష్టాలతో కొంచెం నత్తనడకన సాగుతోంది. ఐతే ఈ మధ్య వివాదాలన్నింటికీ తెరదించేసి కొడుకు సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడట సురేష్. అంతే కాదు.. కొడుకు కోసం ఇంకో సినిమాను కూడా లైన్లోకి తెచ్చాడు.

‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి బ్రీజీ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీను నటించబోతున్నట్లు తెలిసింది. గుండె జారి.. తర్వాత నాగచైతన్యతో విజయ్ తీసిన ‘ఒక లైలా కోసం’ ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ యువ దర్శకుడు ఈ మధ్యే బెల్లంకొండకు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఇది విజయ్ స్టయిల్లోనే సాగే యూత్ ఫుల్ లవ్ స్టోరీ అట. దీన్ని కూడా బెల్లంకొండే నిర్మిస్తాడు. ‘సుందర పాండ్యన్’ రీమేక్ పూర్తి కావడానికి ఇంకో రెండు నెలలు పడుతుంది. దాని తర్వాత కొండా-బెల్లంకొండ కాంబినేషన్ తెరమీదికి వస్తుంది.
Tags:    

Similar News