రాజకీయాలతో బీపీ.. సినిమాలతో మనశ్శాంతి?

Update: 2020-01-14 05:08 GMT
భిన్న ధ్రువాల మధ్య ఆకర్షణ ఎప్పుడూ ఉంటుందన్న మాటకు తగ్గట్లే సినిమాల్లో గ్లామర్ తెచ్చుకున్నాక.. ప్రజాసేవ మీద ఆసక్తి పెరిగిపోవటం ఖాయం. అందుకేనేమో.. సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న తర్వాత రాజకీయాల మీద ఫోకస్ పెట్టటం పెరుగుతుంటుంది. దీనికి తగ్గట్లే సినీ వేల్పుల్ని అక్కున చేర్చుకోవటానికి తాము సదా సిద్దమన్నట్లుగా ప్రజల నుంచి స్పందన ఉండేది. ఈ మధ్యన లెక్కలు కాస్త తేడా కొడుతున్నా.. మొత్తంగా అయితే మాత్రం సినిమా గ్లామర్ ప్రభావం ప్రజల మీద బాగానే ఉందని చెప్పాలి.

సినిమాల్లో ఒక వెలుగు వెలిగి.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావటమే కాదు.. తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేతలు కాస్త తక్కువే. ఆ కోవకే చెందుతారు రాములమ్మ అలియాస్ విజయశాంతి. సినిమాల్లో చేసేటప్పుడు లేడీ అమితాబ్ ఇమేజ్.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పేరుతో అందరిలాంటిదానిని కాదన్న విషయాన్ని తన మాటలతో.. చేతలతో తరచూ స్పష్టం చేస్తుంటారు విజయశాంతి.

తాజాగా ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. పదమూడేళ్ల గ్యాప్ తర్వాత చేసిన ఈ సినిమాలో ఆమెది పవర్ ఫుల్ పాత్ర అంటూ ప్రచారం జరిగినా.. సినిమా చూసినప్పుడు మాత్రం అంత లేదన్న భావన కలగటం ఖాయం. ఈ సినిమాలో భారతి క్యారెక్టర్ చేస్తే విజయశాంతి మాత్రమే చేయాలని.. ఆమెను తప్పించి మరెవరినీ తాను ఊహించుకోలేదంటూ దర్శకుడు చెప్పినప్పుడు అంచనాలు ఒక రేంజ్ లో ఉండేది. తీరా సినిమా చూశాక.. ఆ మాటలు సినిమా మీద ఆసక్తిని మరింత పెంచేందుకు మాత్రమే తప్పించి.. ఇంకేమీ లేదన్నట్లుగా అనిపించక మానదు.

ఇదిలా ఉంటే.. సినిమా విడుదలకు ముందు ప్రచారానికి దూరంగా ఉన్న విజయశాంతి.. తాజాగా మాత్రం సినిమాకు సంబంధించిన విషయాలు చెప్పేందుకు ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం విశేషం. ఈ సందర్భంగా తానున్న రాజకీయాల గురించి.. తాను రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ పెరిగిపోతుందని.. సినిమా చేస్తున్నప్పుడు మాత్రం మనశ్శాంతిగా ఉంటుందని పేర్కొన్నారు. షూటింగ్ లో చాలా బాగా నవ్వుకున్నట్లుగా చెప్పారు. మరింత మనశ్శాంతిగా ఉంటుందనుకుంటే సినిమాలకే పరిమితమైతే బాగుంటుందేమో రాములమ్మ?
Tags:    

Similar News