కంగనా దర్శకత్వంపై విజయేంద్ర ఏమన్నారంటే?

Update: 2018-12-02 16:39 GMT
బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ ‘మణికర్ణిక’ నుంచి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చివరి దశలో తప్పుకోవడం మీద ఇప్పటికే చాలా పెద్ద చర్చ నడిచింది. ‘యన్.టి.ఆర్’ కోసమే క్రిష్ ఆ సినిమాను చివరి దశలో వదిలేశాడని కొందరంటే.. కంగన జోక్యం నచ్చకే అతను బయటికి వచ్చాడని.. తర్వాత ఆమె చాలా మార్పులు చేర్పులతో సినిమాను పూర్తి చేసిందని ఇంకొందరన్నారు. ఇటీవల కంగన తీరు చూస్తుంటే రెండో వాదనే కరెక్ట్ అనిపిస్తోంది. ఈ విషయంలో క్రిష్ అయితే ఎక్కడా ఓపెన్ కావట్లేదు. ఐతే ‘మణికర్ణిక’కు స్క్రిప్టు రాసిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకోవడంపై స్పందించాడు. అలాగే కంగనా దర్శకత్వ ప్రతిభ గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఇంతకీ ఆయనేమన్నాడంటే..

‘మణికర్ణిక’ సినిమా తీసింది క్రిష్ గారే. ఐతే ఆ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా ఆయన ‘యన్‌.టి.ఆర్‌’ చేయాల్సి ఉండి ఇటు వచ్చేశారు. ఇంకేవో కొన్ని సన్నివేశాలుంటే కంగనా రనౌత్‌ డీల్‌ చేయడానికి ముందుకొచ్చింది. ఆమె మధ్యలో నా సాయం కోరింది. ఇదెలా వస్తుంది.. అదెలా ఉంటుంది.. అంటూ కొన్ని సందేహాలు అడిగింది. వాటిని నివృత్తి చేశాను. అసలు ‘మణికర్ణిక’ సినిమాను తెర మీద చూస్తే ఎవరు ఏ సన్నివేశాలను తీశారో కూడా చెప్పలేం. క్రిష్‌ తీసిన సన్నివేశాలకు.. కంగన తీసిన సీన్లకు ఎక్కడా తేడా కనిపించదు. అంత బాగా తీసిందామె’’ అంటూ వివాదానికి తావు లేని మాటలు మాట్లాడారు విజయేంద్ర ప్రసాద్. మరి విజయేంద్ర చెబుతున్నట్లు మరి క్రిష్ ‘యన్.టి.ఆర్’ కోసమే ఇటు వచ్చేసినట్లయితే.. ఆ తర్వాత ‘మణికర్ణిక’ ఊసే ఎత్తట్లేదెందుకు? రేప్పొద్దున ఈ సినిమా ప్రమోషన్లకు అతను వెళ్తాడా?


Tags:    

Similar News