కెప్టెనే కాదు.. ఆ స్టార్ కూడా ఓడిపోయాడు

Update: 2016-05-19 12:45 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ హీరోలకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. గత పర్యాయం 28 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి.. ఈసారి సొంతంగా ముఖ్యమంత్రే అయిపోదామని బరిలోకి దిగిన విజయ్ కాంత్ అడ్రస్ గల్లంతయిపోయింది. మరో స్టార్ హీరో శరత్ కుమార్ కు సైతం పరాభవం తప్పలేదు.

డీఎండీకే సీఎం అభ్యర్థిగా తనకు తాను ప్రచారం చేసుకున్న విజయ్ కాంత్ పార్టీని గెలిపించడం కాదు కదా.. తనను తాను కూడా గెలిపించుకోలేకపోయారు. ఆయనకు కనీసం రన్నరప్ ట్రోఫీ కూడా దక్కలేదు. ఉలుందూర్ పేట నియోజకవర్గంలో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. అన్నాడీఎంకే అభ్యర్థి కుమారగురు విజేతగా నిలవగా.. డీఎంకే పార్టీ అభ్యర్థి రెండో స్థానం దక్కించుకున్నారు.

ఇక శరత్ కుమార్ అధికార అన్నాడీఎంకే పార్టీతో జట్టు కట్టినా ఫలితం లేకపోయింది. సమదువ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడైన శరత్.. జయలలిత కండిషన్ ప్రకారం అన్నాడీఎంకే పార్టీ తరఫునే తిరుచెండూర్ నియోజకవర్గంలో పోటీకి దిగారు. ఆయన డీఎంకే అభ్యర్థి అనితా రాధాకృష్ణ చేతిలో పరాజయం చవిచూశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తాను ఎమ్మెల్యే కాలేకపోవడం శరత్ దురదృష్టమే. ఆల్రెడీ గత ఏడాది నడిగర్ సంఘం ఎన్నికల్లో పరాభవం చవిచూసిన శరత్ కుమార్ కు ఇది దెబ్బ మీద దెబ్బే. సినీ నటుల్లో కరుణాస్ ఒక్కడే గెలిచాడు. అతను తిరువాడనై నియోజకవర్గంలో స్వల్ప తేడాతో విజయం సాధించాడు.
Tags:    

Similar News