సినిమా రివ్యూ : వినవయ్యా రామయ్యా

Update: 2015-06-19 14:26 GMT
రివ్యూ:  వినవయ్యా రామయ్యా
రేటింగ్‌: 2 /5
తారాగణం: నాగ అన్వేష్‌, కృతిక జయకుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, నరేష్‌, తులసి, ఆలీ, సప్తగిరి, షకలక శంకర్‌, హేమ, చలపతిరావు తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌
కథ: ఎలిల్‌
రచన, నిర్మాత: సింధూరపువ్వు కృష్ణారెడ్డి
దర్శకత్వం: జి.రామ్‌ప్రసాద్‌



        'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలో వెంకటేష్‌కు కొడుగ్గా నటించిన పిల్లోడు గుర్తుండే ఉంటాడు. ఆ పిల్లోడు ఇప్పుడు పెద్దోడై హీరో కూడా అయ్యాడు. అతనే నాగఅన్వేష్‌. ఆ సినిమా 'వినవయ్యా రామయ్యా'. ఈ మధ్యే వెంకీ నటించిన 'దృశ్యం'లో ఆయనకు కూతురిగా నటించిన కృతిక జయకుమార్‌ ఇదే సినిమాతో హీరోయినవ్వడం మరో విశేషం. 'చిరునవ్వు'తో ఫేమ్‌ జి.రామ్‌ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పబ్లిసిటీ బాగా చేయడంతో జనాల్ని ఓమోస్తరుగానే ఆకర్షించింది. మరి సినిమా నాగఅన్వేష్‌ కెరీర్‌కు ఎలాంటి పునాది వేసిందో చూద్దాం పదండి.

కథ:

        ఓ పల్లెటూర్లో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేసే చంటి (నాగ అన్వేష్‌).. ఎదురింట్లో ఉండే పెద్దింటి అమ్మాయి జానకి (కృతిక)ని ప్రేమిస్తాడు. తల్లి లేని అమ్మాయైన జానకి అంటే ఆమె తండ్రి చౌదరి (ప్రకాష్‌ రాజ్‌)కి ప్రాణం. జానకి తండ్రి మాటే వేదం. ఐతే చంటి.. జానకిని ప్రేమించినా ఆమె మాత్రం అతణ్ని ఓ స్నేహితుడిగానే చూస్తుంది. ఇంతలోనే జానకికి పెళ్లి ఖాయమవుతుంది. అది చూసి చంటి తట్టుకోలేకపోతాడు. జానకి కూడా చంటిని ప్రేమించిందని అపార్థం చేసుకున్న అతడి స్నేహితులు పెళ్లి మంటపంలోంచి ఆమెను ఎత్తుకొచ్చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? జానకి చంటిని ప్రేమించిందా? వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

        అనూప్‌ రూబెన్స్‌ లాంటి ఫామ్‌లో ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పెట్టుకున్నారు.. రసూల్‌ ఎల్లోర్‌ లాంటి మంచి సినిమాటోగ్రాఫర్‌ను తీసుకున్నారు. ప్రకాష్‌ రాజ్‌ లాంటి స్టేచర్‌ ఉన్న నటుణ్ని సినిమాలో కీలక పాత్రకు ఒప్పించారు. బ్రహ్మానందం, ఆలీ, సప్తగిరి, షకలక శంకర్‌ లాంటి కమెడియన్లను సెట్‌ చేసుకున్నారు. వీటన్నింటికీ తోడు ఓ కొత్త హీరో స్థాయికి మించి ఖర్చు కూడా పెట్టారు. కానీ ఇన్ని ఉన్నా ఏం లాభం.. కథాకథనాల్లో పట్టు లేనపుడు!

        హీరోయిన్‌కు హీరో అంటే ప్రేమ లేదు. అతడెంత బతిమాలినా తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అలాంటమ్మాయిని హీరో ఎలా ప్రేమలోకి దించుతాడా అని అనుకుంటాం. ఐతే అతనేమో ఆర్యలో హీరోలా క్యారెక్టర్లు రివర్స్‌ చేసి హీరోయినే తనను ప్రేమించినట్లు అందరి ముందు తమ ప్రేమకథ గురించి చెబుతాడు. మొదట్నుంచి ప్రథమార్ధంలో మొదట్నుంచి హీరో ప్రేమకథను ఫాలో అవుతున్న ప్రేక్షకుడికి ఏ దశలోనూ ఎమోషన్‌ రాదు కానీ.. ఈ సీన్‌లో హీరో చెప్పిన కథ విన్న పది మందీ కళ్లల్లో నీళ్లు పెట్టేసుకుంటారు. ఓ ఎమోషన్‌ తెచ్చేసుకుంటారు. అంతే హీరోయిన్‌ కూడా కదిలిపోతుంది.

        తర్వాతి సన్నివేశంలో అందరూ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్తారు. హీరోయిన్‌కు చేపల పులుసు ఇష్టమని ఆర్డర్‌ చేస్తే అది చేసే కుక్‌ లేడంటారు. అంతే.. హీరో వెంటనే కిచెన్‌లోకి వెళ్లిపోయి అమ్మకు ఫోన్‌ చేసి చేపల పులుసు తయారీ తెలుసుకుని.. వంట చేసి పట్టుకొచ్చేస్తాడు. అంతే.. హీరోయిన్‌ కూడా ఫ్లాట్‌ అయిపోయి.. ''నేనంటే నీకు ఎందుకింత ఇష్టం చంటీ'' అంటుంది. ఇక ఆ నెక్స్ట్‌ సీన్‌లోకి వెళ్తే.. హీరోయిన్‌ చలికి వణుకుతుంటుంది. హీరో కూల్‌డ్రింక్‌ను వేడి చేసి తీసుకొస్తాడు. అంతే ఇక హీరోయిన్‌ పూర్తిగా ఫ్లాట్‌ అన్నమాటే. ఇలాంటి సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కన్విన్స్‌ చేయొచ్చని ఎలా అనుకున్నారో హీరో తండ్రి, నిర్మాత, ఈ చిత్రానికి రచయిత కూడా అయిన 'సింధూర పువ్వు' కృష్ణారెడ్డి.

        కొత్త కథానాయకుడిని పరిచయం చేస్తూ రిస్క్‌ ఎందుకనుకున్నారో ఏమో.. కథాకథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేకుండా జాగ్రత్త పడ్డారు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌, ప్రతి సన్నివేశం కూడా ఏదో ఒక సినిమాలో చూసినట్లే ఉంటుంది. పెద్దింటి అమ్మాయి.. మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు.. అతడికో ఫ్రెండ్స్‌ బ్యాచ్‌.. కొడుకును తిట్టిపోసే తండ్రి, ముద్దు చేసే తల్లి.. కూతురంటే ప్రాణం పెట్టే తండ్రి.. ఇలా సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌నూ ఏదో ఒక సినిమాలోంచి తీసుకున్నట్లే ఉంటుంది.

        ప్రథమార్ధం హీరో యాంగిల్‌లో సాగే ప్రేమకథలో ఫీల్‌ లేకపోయింది. హీరో ఫ్రెండ్స్‌ బ్యాచ్‌తో ఏదో అలా కామెడీ చేయించి.. అతి కష్టం మీద ఫస్టాఫ్‌ను ముగించాడు దర్శకుడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తోటే ఇక ద్వితీయార్ధంలో ఏం జరగబోయేది అర్థమైపోతుంది. హీరోయిన్‌ మనసు మార్చి.. ఆమెను తనదాన్ని చేసుకోవడానికి చాలా సినిమాల్లో హీరో ఏం చేశాడో అదే చేస్తాడు ఈ కథానాయకుడు కూడా. ఐతే ఆ సన్నివేశాలు ఎంత కన్విన్సింగ్‌గా ఉన్నాయో ముందే చెప్పుకున్నాం. సినిమా గురించి ప్రచారం చేసుకుంటూ 'ఉన్నత విలువలతో తెరకెక్కిన సినిమా'గా చెప్పుకున్నారు. సినిమాలో చెప్పుకోదగ్గవి ఆ నిర్మాణ విలువలే. మంచి పాటలు, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు.. ఇలాంటి అదనపు ఆకర్షణలు బాగానే ఉన్నాయి కానీ.. అసలు విషయంలోనే తేడా వచ్చేసింది.

నటీనటులు:

        నాగ అన్వేష్‌ నటన పర్వాలేదు. కుర్రాడిలో చురుకుదనం ఉంది. డ్యాన్సులు బాగా చేశాడు. ఐతే నటనలో ఇంకా పరిణతి చెందాలని కొన్ని సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది. తొలి సినిమా కాబట్టి తప్పుల్ని క్షమించొచ్చు. దృశ్యంలో కృతికను చూసి.. ఈ సినిమాలో చూస్తే ఆశ్చర్యపోతాం. అంత అందంగా కనిపించింది. ఐతే లంగావోణీల్లో ఉన్నపుడు హోమ్లీ హీరోయిన్‌ క్యారెక్టర్స్‌కు ఓకే అనిపించింది కానీ.. మోడర్న్‌ డ్రెస్సులేసినపుడు అస్సలు సూటవ్వలేదు. సీరియస్‌ సన్నివేశాల్లో ఆమె నటన తేలిపోయింది. ప్రకాష్‌ రాజ్‌ వేయాల్సిన పాత్ర కాదు ఇది. ఏదో మొహమాటం కొద్దీ ఒప్పుకున్నట్లున్నారు కానీ.. ఆయన తన ప్రత్యేకత చూపించడానికి ఏమీ లేకపోయింది. నరేష్‌, తులసిల పాత్రలు కూడా చెప్పుకోదగ్గవి కావు. షకలక శంకర్‌ ఒకట్రెండు సన్నివేశాల్లో నవ్వించాడు. బ్రహ్మి క్యారెక్టర్‌కు బిల్డప్‌ ఎక్కువైంది. ఆయన నవ్వించడంలో పూర్తిగా ఫెయిలయ్యారు. సప్తగిరి, ఆలీ కూడా చేసిందేమీ లేదు.

సాంకేతిక వర్గం:

        సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలు సంగీతం, ఛాయాగ్రహణమే. అనూప్‌ రూబెన్స్‌ మంచి పాటలే ఇచ్చాడు. గోల గోల, పోపో, బిగి బిగి.. పాటలు బాగున్నాయి. ఐతే పాటలు అవి చాలా వరకు అసందర్భోచితంగా అనిపించాయి. వాటి టైమింగ్‌ సరిగా లేదు. అనూప్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. రసూల్‌ ఎల్లోర్‌ పల్లెటూరి అందాల్ని తన కెమెరాలో బాగానే బంధించాడు. పాటల్లో అతడి కెమెరా పనితనం బాగా కనిపిస్తుంది. సినిమాకు రిచ్‌ లుక్‌ తేవడంలో అతడి పాత్ర కీలకం. ముందే అన్నట్లు నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి వీల్లేదు. బడ్జెట్‌ పరిమితులేమీ పెట్టుకోకుండా కొడుకు కోసం బాగానే ఖర్చుపెట్టారు నిర్మాత కృష్ణారెడ్డి. ఐతే రచన బాధ్యతలు వేరెవరికైనా ఇచ్చి ఉండాల్సింది. ఇంత ఖర్చు చేస్తున్నపుడు కథాకథనాల మీద కాస్తయినా శ్రద్ధ పెట్టకపోవడమే విచారించాల్సిన విషయం. రామ్‌ప్రసాద్‌ దర్శకత్వం గురించి చెప్పడానికేం లేదు. చిరునవ్వుతో లాంటి సినిమా తీసిన రామ్‌ప్రసాద్‌ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని అనుకోలేం. ఏదైనా రచనను బట్టే ఉంటుంది తప్ప తనదేం ఉందని ఆయన మొక్కుబడిగా బండి లాగించేసినట్లున్నారు.

చివరిగా...

        రెండున్నర గంటల రొటీన్‌ ప్రేమకథ.. వినవయ్యా రామయ్యా. ఇక ఛాయిస్‌ మీదే!

Tags:    

Similar News