నిర్బయ కేసులో ప్రముఖ తెలుగు నటుడి అరెస్ట్‌

Update: 2019-04-23 14:25 GMT
హైదరాబాద్‌ లో గత కొన్ని సంవత్సరాలుగా సూత్రధార్‌ అనే యాక్టింగ్‌ స్కూల్‌ నడపడంతో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించిన నటుడు వినయ్‌ వర్మను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు పంపించారు. కొన్ని రోజుల క్రితం సూత్రధార్‌ యాక్టింగ్‌ స్కూల్‌ స్టూడెంట్‌ అయిన ఒక అమ్మాయి వినయ్‌ వర్మ పై కేసు పెట్టిన విషయం తెల్సిందే. యాక్టింగ్‌ నేర్చుకోవాలంటే డ్రస్‌ విప్పాల్సిందే అని - లేదంటే బయటకు వెళ్లి పోవాలంటూ లైంగికంగా వేదించాడంటూ ఆమె షీ టీమ్‌ కు ఫిర్యాదు చేసింది. మొదట ఫిర్యాదు నమోదు చేసేందుకు టైం తీసుకున్న పోలీసులు ఆ తర్వాత కేసు నమోదు చేశారు.

కేసు నమోదు చేసిన తర్వాత వినయ్‌ వర్మను అరెస్ట్‌ చేయకుండా మొదట ప్రశ్నించారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న నేపథ్యంలో నేడు ఆయన్ను అరెస్ట్‌ చేయడం జరిగింది. నారాయణ గూడా పోలీసులు వినయ్‌ వర్మను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు పంపించడం జరిగింది. నిర్బయ చట్టంతో పాటు - పలు సెక్షన్స్‌ కింద అతడిపై కేసు నమోదు అయ్యింది. వినయ్‌ వర్మ అరెస్ట్‌ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. వినయ్‌ వర్మను అరెస్ట్‌ చేసిన పోలీసులు వెంటనే నాంపల్లి కోర్టు ముందు హాజరు పర్చారు. కోర్టు వినయ్‌ వర్మకు రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించడం జరిగింది.


Tags:    

Similar News