పైరసీపై విశాల్ అటాక్..

Update: 2017-04-23 10:40 GMT
తమిళనాట పైరసీ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలిసిన సంగతే. అక్కడ సినిమా రిలీజైన కొన్ని గంటలకే కొన్ని పైరసీ వెబ్ సైట్లలో ప్రింట్ ప్రత్యక్షమవుతుంది. పైరసీ సీడీలు కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చేస్తాయి. దీనిపై నిర్మాతలు ఎంత గగ్గోలు పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ మధ్య సూర్య సినిమా ‘సింగం-3’ మార్నింగ్ షో పడే సమయానికల్లా తమ సైట్లో లైవ్ రన్ అవుతుందంటూ ‘తమిళ్ రాకర్స్’ అనే వెబ్ సైట్ ట్విట్టర్లో ప్రకటించేంత వరకు వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతగా జడలు విప్పిన పైరసీని అడ్డుకునేదెవరు.. అనుకుంటున్న సమయంలో విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

అతను గతం నుంచే పైరసీపై పోరాడుతున్నాడు. ఒకసారి పైరసీ సీడీల షాపులపై దాడికి కూడా దిగాడు. నిర్మాతల మండలి ఎన్నికల బరిలో దిగినపుడు కూడా తన పోరాటం పైరసీ మీదే అన్నాడు. అందుకు తగ్గట్లే పదవీ బాధ్యతలు చేపట్టగానే రంగంలోకి దిగాడు. థియేటర్లలో ఎవరైనా సినిమాను పైరసీ చేస్తున్నట్లు గమనించి.. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. ఎఫ్ ఐఆర్ కాపీ పంపిస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తానని నిర్మాతల మండలి తరఫున ప్రకటించాడతను. దీంతో పాటు తమిళ్ రాకర్స్ తదితర వెబ్ సైట్లను ఎలా కట్టడి చేయాలో పరిష్కారాల కోసం నిర్మాతలతో ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తున్నాడతను. విశాల్ ఏదైనా విషయం మీద దృష్టిపెడితే దాని సంగతేంటో చూసేదాకా వదలడని పేరుంది. మరి పైరసీ మీద పోరాటంలోనూ అతను విజయవంతం అవుతాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News