అమీర్.. ఆఫ్గనిస్తాన్ లో ఉన్నామా? -విష్ణు

Update: 2015-11-24 10:12 GMT
అమీర్ వ్యాఖ్యలపై బాలీవుడ్ తీవ్రంగానే స్పందిస్తోంది. అనుపమ్ ఖేర్ - పరేష్ రావల్ - రాంగోపాల్ వర్మలు అమీర్ ని గట్టిగానే నిలదీశారు. మరోవైపు అమీర్ చేసిన ఈ అసహనం వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. హీరో మంచు విష్ణు కాస్త ఘాటుగానే స్పందించడం విశేషం. అమీర్ ఖాన్ మంచి నటుడని, అతనిపై గౌరవం ఉందంటూనే... అసలు అసహనం ఎక్కడ లేదు అని అడిగాడు విష్ణు.

పాకిస్తాన్ లో ఉన్న హిందువులు - ముస్లింలను బంగ్లాదేశ్ లో ముస్లింలను... అతి గొప్ప దేశమైన అమెరికాలో కష్టాలు పడుతున్న ఆఫ్రికన్ అమెరికన్ సోదరులను దాని గురించి అడగాలని సూచించాడు మంచు విష్ణు. అంతే కాదు.. అసహనం ప్రతీ చోటా ఉందని.. కొంత కరడు గట్టిన మీడియా ఇలాంటి సంఘటనలను భూతద్దంలో చూపి.. భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. కొందరు ఈడియట్స్ ఈ అభద్రతా భావాన్ని సృష్టించారని, కొన్ని సంఘటనలు భవిష్యత్తుకు మార్గదర్శకం కాదన్న విష్ణు.. సమాజంలో ఒక భాగంగా ఉన్న మనం వాటిని సరిదిదిద్దాలన్నాడు. అభద్రతా భావాన్ని ఫీల్ అయ్యేందుకు మనమేం ఆఫ్ఘనిస్తాన్ లో లేము కదా అమీర్ అంటూ.. ఇండియా వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశాడు మంచు విష్ణు.

అయితే.. ఒక నటుడిగా మాత్రం అమీర్ ఖాన్ ని తాను ఇష్టపడతానని తెలిపాడు. టాలీవుడ్ లో అసహనంపై ఇంత ఓపెన్ గా మాట్లాడిన ఏకైక హీరో విష్ణు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. విష్ణు కామెంట్స్ కి టాలీవుడ్ నుంచి బోలెండత అప్లాజ్ వస్తుండడం విశేషం.
Tags:    

Similar News