విశ్వరూపం-2.. బిజినెస్ కాలేదా?

Update: 2018-08-03 05:32 GMT
కమల్ హాసన్ కొత్త సినిమా ‘విశ్వరూపం-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడో 2013లో వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రానికి ఇదీ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అంతా అనుకున్న ప్రకారం జరిగితే తొలి భాగం వచ్చిన ఏడాదికల్లా ఈ చిత్రం కూడా రిలీజ్ కావాల్సింది. కానీ దాని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు డబ్బులు కేటాయించలేని స్థితిలో పడటంతో సినిమా మరుగున పడిపోయింది. కమల్ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశాడు. చివరికి గత ఏడాది ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తనే సొంతంగా ఖర్చు పెట్టి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేశాడు. సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఐతే తొలి భాగం వచ్చిన ఐదేళ్లకు వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారో అన్న సందేహాలు లేకపోలేదు.

కమల్ ఎంత ధీమాగా ఉన్నప్పటికీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఆసక్తి కనిపించడం లేదని సమాచారం. ఈ చిత్రానికి అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగట్లేదని సమాచారం. తమిళంలో కమల్ కొంచెం తగ్గి సినిమాను అమ్మే ప్రయత్నంలో ఉన్నాడట కానీ.. తెలుగులో మాత్రం రెస్పాన్స్ ఏమాత్రం ఆశించిన విధంగా లేదట. రేట్లు తగ్గించినా సినిమాను కొనడానికి బయ్యర్లు అంతగా ఆసక్తి చూపించట్లేదని సమాచారం. ఇలా డిలే అయిన సినిమాలు బాగా ఆడిన దాఖలాలు చాలా తక్కువ. ‘విశ్వరూపం-2’ బడ్జెట్ చూస్తే భారీగా అయింది. లాభాలకు కాకపోయినా.. పెట్టుబడి రాబట్టుకునేలా సినిమాను అమ్ముదామన్నా.. కష్టంగానే ఉందట. అందుకే ఇక్కడ ఆడియో వేడుక చేసి కొంచెం హంగామా చేయాలని కమల్ చూశాడు. మీడియాకు కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలిచ్చాడు. మరి ఇప్పుడైనా సినిమా సేల్ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News