కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ `విశ్వరూపం` రిలీజై బోలెడన్ని వివాదాల్ని తెచ్చింది. ఈ సినిమాలో ముస్లిముల్ని తీవ్రవాదులుగా చూపారన్న అపవాదు ఎదుర్కోవాల్సొచ్చింది. అయితే `విశ్వరూపం 2`లో కమల్ అందుకు సరైన సమాధానం చెబుతున్నారా? అంటే అవుననే అర్థమవుతోంది. ఇటీవల రిలీజైన కొత్త ట్రైలర్ ని డీప్ గా పరిశీలిస్తే .. ఆ విషయం అవగతమవుతోంది.
అల్ ఖైదా వల్ల ప్రపంచదేశాలకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనే భారతీయ ఆర్మీ అధికారిగా.. సీక్రెట్ స్పై అధికారిగా కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించారు. డ్యూటీ సరిగా చేయని ఆర్మీవోడిని వెలి వేసిన భారతీయ ఆర్మీ అన్న పాయింట్ ని స్పష్టంగా చెప్పారు. అంటే వాసిమ్ అహ్మద్ కశ్మీరీ (కమల్) ఒక స్పైగా మారకముందు అతడిని ఆర్మీ బయటకు గెంటేసింది.. అన్న లాజిక్ ని వాడారు. ఆ క్రమంలోనే అతడు విదేశాల్లో ఎంతో అమాయకుడైన క్లాసికల్ డ్యాన్స్ ట్రైనర్ గా కనిపిస్తాడు. ఆ ముసుగులో అతడు బ్యాక్ టు ద డ్యూటీ ఎలా వచ్చాడు? ఆపరేషన్ ని దిగ్విజయంగా ఎలా పూర్తి చేయాలనుకున్నాడు? అన్నది ప్రథమ భాగంలో చూశాం. ఇకపోతే రెండో భాగంలో దానికి కంటిన్యుటీ ఉంటుంది. ఈ పార్ట్ లో ముస్లిములే తీవ్రవాదులు అని చెప్పడం లేదని కమల్ క్లారిటీ ఇవ్వబోతున్నాడు. తీవ్రవాదులతో కూచుని మాట్లాడితే సమస్యలన్ని పరిష్కారం అవుతాయి. ప్రభుత్వాలు ఆ పని చేస్తే తీవ్రవాదమే ఉండదు అని ట్రైలర్ లోనే చెప్పాడు కాబట్టి తెరపైనా దానిని ఎలివేట్ చేస్తూ చెప్పబోతున్నాడు. ఇక ఇండియా- పాకిస్తాన్ మతప్రాతిపదికన విడిపోవడం అన్న పాయింట్ ఆధారంగా ఈ కథల్ని రాసుకున్నానని కమల్ ఇదివరకూ వెల్లడించిన సంగతి తెలిసిందే. విశ్వరూపం 2 ట్రైలర్లు అంతకంతకు ఉత్కంఠ పెంచేస్తున్నాయి. ఆగస్టు 10న అంటే ఇంకో పది రోజుల్లో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా కోసం తెలుగు జనంతో పాటు - ఫిలిం క్రిటిక్స్ సైతం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.