మా సినిమాను వాయిదా వేస్తున్నాం: రాంగోపాల్ వర్మ

Update: 2021-03-19 17:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి జనాలను వణికిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేలసంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ అని భావిస్తుంది. కానీ ఈసారి వైరస్ మరింత భయంకరమైనదిగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరోసారి కరోనాను భరించే శక్తి జనాల్లో లేదు. ఇప్పటికే ఘోరమైన నష్టాలను మిగిల్చింది. ఇప్పుడిప్పుడే అన్ని వ్యాపారాలతో పాటు సినీ ఇండస్ట్రీలు కూడా కోలుకుంటున్నాయి. ఓవైపు వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ లాక్ డౌన్ అమలు చేసాయి ఆయా రాష్ట్రప్రభుత్వాలు. ప్రస్తుతం మూడు లక్షలవరకు కరోనా బాధితులు వివిధ ఆసుపత్రులు, కరోనా కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డైరెక్టర్ తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. ఆయనేవరో కాదు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇటీవల ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'డి-కంపెనీ' సినిమాను మార్చ్ 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అలాగే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ విడుదల చేసి సినిమా పై అంచనాలు క్రియేట్ చేసాడు. కానీ దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి చూసి డి-కంపెనీ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు వర్మ. 'దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు కొత్త లాక్డౌన్ పై వస్తున్న సమాచారం నేపథ్యంలో మా 'డి కంపెనీ' విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలోనే ప్రకటిస్తాం' అని వర్మ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశాడు.
Tags:    

Similar News