'ఆదిపురుష్' వీఎఫ్ఎక్స్ విషయంలో ఎవరు అబద్ధం చెబుతున్నారు..?

Update: 2022-10-04 03:58 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ''ఆదిపురుష్‌''. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ పౌరాణిక గాథ తెరకెక్కింది. ఆదివారం అయోధ్యలో విడుదల చేసిన సినిమా టీజర్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'ఆదిపురుష్‌' టీజర్‌ కొందరిని ఆకట్టుకుంటే.. ఎక్కువమందిని నిరుత్సాహ పరచింది. గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ పనితనం మీద ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. కార్టూన్ సినిమాలా ఉందని.. ఆన్ లైన్ వీడియో గేమ్ తరహాలో తీశారని విమర్శిస్తున్నారు.

ఇలాంటి అవుట్ ఫుట్ కోసం మేకర్స్ కు అంత బడ్జెట్ ఎలా ఖర్చు అయింది.. పౌరాణికాల మీద తీసిన డైలీ సీరియల్స్ గ్రాఫిక్స్ ఇంతకంటే చాలా బెటర్ గా ఉంటాయని కామెంట్స్ చేశారు. ఇటీవలి కాలంలో నాసిరకమైన VFX కారణంగా ఏ భారతీయ సినిమా టీజర్ లేదా ట్రైలర్‌ కు ఈ స్థాయిలో విమర్శలు రాలేదని చెప్పాలి.

'ఆదిపురుష్‌' మేకర్స్ మరియు VFX బృందం పై నెటిజన్లు మరియు ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. దీని కోసం ఇన్ని నెలల సమయం ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ ని మెరుగుపరచడానికి ఇంకాస్త సమయం తీసుకున్నా పర్లేదు కానీ.. ఇదే విధంగా సినిమాని రిలీజ్ చేయొద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ట్విట్టర్ లో VFX బృందాన్ని ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో.. అజయ్‌ దేవ్‌ గన్ కు చెందిన 'NY వీఎఫ్ఎక్స్ వాలా' కంపెనీ ఈ నెగెటివిటీపై స్పందించింది. 'ఆదిపురుష్‌' కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్‌ పై తాము పని చేయలేదని వివరణ ఇచ్చారు.

అయితే NY VFXwaala సహ వ్యవస్థాపకుడు ప్రసాద్ సుతార్ గతంలో తమ టీమ్ 'ఆదిపురుష్‌' సినిమా కోసం వర్క్ చేస్తోందని పేర్కొనడం ఇప్పుడు అందరి దృష్టికి వచ్చింది. సుతార్ ట్విట్టర్ ప్రొఫైల్ హెడర్‌ లో ఇప్పటికీ 'ఆదిపురుష్' పోస్టర్ ఉంది. అలానే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని అతను రీట్వీట్ చేస్తూ వస్తున్నాడు.

'ఆదిపురుష్' టీజర్ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ మరియు నిర్మాణ సంస్థ టీ-సిరీస్ సైతం తమ ట్వీట్స్ లో NY వీఎఫ్ఎక్స్ వాలా కంపెనీని ట్యాగ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమా VFX తో తమకు సంబంధం లేదని ఓ నోట్ ని రిలీజ్ చేశారు. దీంతో ఈ విషయంలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

'ఆదిపురుష్' విజువల్ పనితనంపై సోషల్ మీడియాలో నెగెటివిటీ వస్తున్న నేపథ్యంలో.. తాము ఈ చిత్రానికి పని చేసామని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సదరు కంపెనీ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేయకపోతే.. దర్శకుడు ఓం రౌత్ స్వయంగా ఆ వర్క్ కూడా చేసుకున్నారా? అని సెటైరికల్ గా పోస్టులు పెడుతున్నారు.

ఏదేమైనా 'ఆదిపురుష్' టీమ్ మంచి విజువల్స్‌ తో రావాలని అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసింది కేవలం టీజర్ మాత్రమే కాబట్టి.. ఫైనల్ ప్రోడక్ట్ మెరుగ్గా ఉంటుందని.. కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

కాగా, 'ఆది పురుష్' సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. జానకిగా కృతీ సనన్‌.. లంకేశుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News