2020 సీజ‌న్: OTT రిలీజ్ ల‌లో విజేత ఎవ‌రో తేలిందా?

Update: 2020-11-17 11:50 GMT
క‌రోనా క్రైసిస్ ఏడెనిమిది నెల‌లుగా సినీప‌రిశ్ర‌మ‌ల్ని అట్టుడికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రంగంలో ఎంద‌రో ఉపాధి కోల్పోవ‌డానికి కార‌ణ‌మైంది ఈ మ‌హ‌మ్మారీ. ఇప్పుడిప్పుడే కాస్త స‌న్నివేశం అదుపులోకి వ‌స్తుంద‌న్న ఆశ క‌నిపిస్తోంది. అయితే ఈలోగానే జ‌ర‌గాల్సిన డ్యామేజీ జ‌రిగిపోయింది. అయితే ఈ స‌న్నివేశంలోనే ఓటీటీకి అనూహ్యంగా బ‌లం పెరిగింది. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్ వంటివి బాగా బ‌లం పుంజుకున్నాయి. డిజిట‌ల్ కి అద‌ర‌ణ ఆశావ‌హంగా మారింది.

దీంతో ప‌లువురు స్టార్ల సినిమాలు ఓటీటీల్లో డైరెక్ట్ గా రిలీజ‌య్యాయి. వీళ్ల‌లో ప్ర‌ముఖ సౌత్ .. నార్త్ క‌థానాయ‌కుల సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌-అక్ష‌య్ కుమార్-సుశాంత్ సింగ్ - ఫ‌హ‌ద్ ఫాజిల్- కీర్తి సురేష్‌- స‌త్య‌దేవ్ తదిత‌ర‌ స్టార్లు న‌టించిన సినిమాలు ఓటీటీలో విడుద‌ల‌య్యాయి.

ఇంకాస్త వివ‌రంగా వెళితే.. లాక్ డౌన్ లో అన్ని థియేట్రికల్ కార్యకలాపాలు ఆగిపోయాయి. మార్చి 24 నుండి భారత ప్రధానమంత్రి  లాక్ డౌన్ 1.0 ప్రారంభమైనట్లు ప్రకటించినప్పుడు థియేట్రికల్ రిలీజ్ లు నిలిచిపోయాయి. అప్పటి నుండి OTTల్లో మాత్ర‌మే రిలీజ్ ల‌కు ఆస్కారం ఏర్ప‌డింది. OTT ప్రత్యక్ష విడుదలలు చాలా వ‌ర‌కూ నిరాశపరిచినా..ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి.

ముఖ్యంగా హిందీ బెల్టులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన‌ ‘దిల్ బెచారా’ ఓటీటీలో ఘ‌న‌విజయం సాధించింది. అత‌డు మరణించిన అనంత‌రం ఘ‌న‌మైన నివాళి గా నిలిచింది ఆ చిత్రం. దక్షిణాదిన సూర్య న‌టించిన ‘సూరరై పొట్రూ’ అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ చేయ‌గా మంచి స్పంద‌న ల‌భించింది.

వీటితో పాటు అక్షయ్ కుమార్ ‘లక్ష్మి’ విమర్శకుల నుంచి ఇబ్బంది ఎదుర్కోక త‌ప్ప‌లేదు. ఫహ‌ద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం..‘సి యు సూన్’ అంద‌రి దృష్టిని ఆకర్షించింది.  అయితే ఈ ఆరేడు నెల‌ల్లో డిజిట‌ల్లో అతి పెద్ద విజ‌యం సాధించిన సినిమా ఏది? అన్న‌దానికి స‌రైన స‌మాధానం లేనేలేదు. ఉన్న‌వాటిలో హిందీ చిత్రాల పెర్ఫామెన్స్ బావుంద‌న్న టాక్ అయితే వ‌చ్చేసింది.
Tags:    

Similar News