ఏపీ టాలీవుడ్ ఊసే లేదు!

Update: 2019-01-07 06:30 GMT
``ఊరక రారు మహానుభావులు`` అన్నారు పెద్ద‌లు.. అయితే ఆ మ‌హానుభావుడు వ‌చ్చారంటే ఏదో ఒక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని ఆశిస్తారు ఏపీ ప్ర‌జ‌లు. కానీ ఆయ‌నేమీ ప్ర‌క‌టించ‌లేదు. అయినా ప్ర‌క‌టించిన వాటికే దిక్కులేదు.. కొత్త ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు?  భాజా భ‌జంత్రీల్లా! అంటారా? ఇదంతా ఎవ‌రి గురించి అంటే ఏపీఎఫ్ డీసీ అధ్య‌క్షుడు అంబికాకృష్ణ గురించే. ఇదిగో పులి అంటే అదిగో మేక‌! అన్న చందంగా ఏపీ టాలీవుడ్ పై ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

పెద్ద‌లు ఊర‌క రారు.. వ‌చ్చినా ఏమీ చేయ‌రు!! అన్న‌ట్టే ఉంది ఈ టీడీపీ అనుకూల ఎఫ్ డీసీ అధ్య‌క్షుని క‌థాక‌మీమీషు. నిన్న‌టి సాయంత్రం ర‌జ‌నీ `పేట` ఈవెంట్‌లో ర‌జ‌నీ గురించి గొప్ప‌లు చెప్పిన ఏపీఎఫ్ డీసీ ఛైర్మ‌న్ అంబికాకృష్ణ అస‌లు ఏపీ టాలీవుడ్ గురించి ప‌ల్లెత్తు మాట‌యినా చెప్ప‌లేదు. ``ర‌జ‌నీ దైవాంశ సంభూతుడు!`` అంటూ అంబికా కృష్ణ భ‌లేగా చెప్పారు కానీ, అస‌లు సంగ‌తి మ‌రిచారు అంటూ సినీజ‌నం బుర్ర‌లు గోక్కున్నారు.

2018లో నాలుగైదు సార్లు ఏపీ టాలీవుడ్ గురించి ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు అంబికృష్ణ‌. వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ ని ఆనుకుని నాలుగైదు భారీ స్టూడియోల నిర్మాణం జ‌ర‌గ‌నుందని అన్నారు. బాల‌కృష్ణ స్టూడియోస్‌, ఏవీఎం స్టూడియోస్ ద‌ర‌ఖాస్తులు అందాయ‌ని తెలిపారు. ఆ మేర‌కు హైద‌రాబాద్ మీడియాకి ప్రెస్ నోట్లు పంపారు ఘ‌నంగా. అయితే ఆ త‌ర్వాత దాని ఊసేలేదు. అస‌లేం జ‌రుగుతోందో కూడా తెలీదు. ఉగాది పండ‌గ‌, దీపావ‌ళి పండ‌గ అంటూ విజ‌య‌వాడ‌లో ల‌ఘు చిత్రాల పోటీలు పెట్టి హ‌డావుడి చేశారు. అలాగే నంది అవార్డులు అంటూ మ‌రో హ‌డావుడి. ఇదంతా చూస్తుంటే హ‌డావుడి త‌ప్ప అస‌లు విష‌యం ఏమీ లేదు! అన్న విమ‌ర్శ‌లు స‌ద‌రు స‌ర్కారు మ‌నిషిపై వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్ ఇండ‌స్ట్రీ ఎప్ప‌టికి క‌ట్టేను? అస‌లు అక్క‌డ టాలీవుడ్ నెల‌కొల్పుతారా?  లేదా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఉత్త‌రాంధ్ర‌లో బ‌లంగా సాగుతోంది. ఇప్ప‌టికీ వైజాగ్ వాసులు ఏపీలో టాలీవుడ్ పెట్టాల్సి ఉంటే, అది వైజాగ్ లోనే సాధ్యం అని న‌మ్ముతున్నారు.

అయితే తెలంగాణ‌లో టీఆర్ ఎస్ గెలిచాక తొలి లైవ్ ఈవెంట్ లో పాల్గొన్న అంబికా కృష్ణ ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున ఆ ఊసే ఎత్తలేదు.. ఏపీ టాలీవుడ్ విష‌యంలో అస‌లేం జ‌రుగుతోంది అన్న డైలెమా కొన‌సాగుతోంది. అస‌లు అదంతా ఉత్తుత్తేనా?  ఏదో గాలివాటం ప్ర‌క‌ట‌న‌లేనా? అంటూ ఒక‌టే చెడుగుడు ఆడేస్తున్నారు క్రిటిక్స్. మ‌రి అంబికావారిలోనే చ‌ల‌నం లేదా?  లేక ఏపీ సీఎంలోనూ చ‌ల‌నం లేదా? అంటూ మాట్లాడుకుంటున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబుకు ఏమాత్రం గిట్ట‌ని గంటా శ్రీ‌నివాస‌రావు మాత్రం వైజాగ్ కి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాల‌ని ప‌దే ప‌దే వేదిక‌లు ఎక్కి బాకా ఊదుతున్నా అది ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తానికి ఏపీ ప్ర‌జ‌ల‌కు వినోద‌రంగం ప‌రంగా శ‌ఠ‌గోపం త‌ప్ప‌ద‌నే భావిస్తున్నారంతా. వైజ‌గ్ ని మ‌రో హాంకాంగ్ ఇండ‌స్ట్రీని చేస్తాం! అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం.. ప‌నులు శూన్యం! అన్న చందంగానే సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఉండ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.



Full View

Tags:    

Similar News