రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''లైగర్''. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చుట్టూ నెలకొన్న హైప్ దృష్ట్యా తొలి రోజు వసూళ్ళు పర్వాలేదనిపించాయి. రివ్యూలు మరియు మౌత్ టాక్ నెగిటివ్ గా రావడంతో రెండో రోజు నుంచి భారీ డ్రాప్స్ కనిపించాయి.
సినిమా టాక్ బాగాలేకున్నా.. రివ్యూలు ఆశాజనకంగా లేకున్నా.. ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్లు మరీ దిగజారిపోకుండా చూసుకోడానికి చిత్ర బృందాలు హడావిడి చేస్తుండటం మనం చూస్తుంటాం. ఆఫీసు ముందు బాణసంచా కాల్చడం.. రిలీజ్ రోజే థాంక్స్ మీట్ లేదా సక్సెస్ మీట్ పెట్టడం.. అంత కలెక్ట్ చేసింది ఇంత వసూలు చేసిందంటూ పోస్టర్స్ రిలీజ్ చేయడం చూస్తుంటాం.
ఇటీవల బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలకు కేక్స్ కట్ చేసి.. సక్సెస్ సెలబ్రేషన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ 'లైగర్' విషయంలో మాత్రం ఇవేమీ కనిపించలేదు. సినిమా విడుదలై నాలుగు రోజుల అయినా ఇంతవరకు కోర్ టీమ్ నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.
'లైగర్' సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ ఎంత హడావుడి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగస్ట్ 25వ తేదీన ఇండియా మొత్తం షేక్ అవుతుంది.. థియేటర్లు బ్లాస్ట్ అవుతాయంటూ గొప్పలు చెప్పిన మేకర్స్.. విడుదల తర్వాత సైలెంట్ అయిపోయారు.
చిత్ర నిర్మాణ సంస్థలు పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ మాత్రం ట్వీట్లు రీట్వీట్లతో సందడి చేస్తోంది. కానీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. 'లైగర్' కు హిందీలో మంచి రెస్పాన్స్ వస్తోందని ట్వీట్ చేసిన ఛార్మీ కౌర్.. రీట్వీట్స్ కే పరిమితమైంది. ఆడియన్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న పూరీ జగన్నాథ్.. ఇప్పుడు కూడా అదే దూరం మెయింటైన్ చేస్తున్నారు. నిర్మాత కరణ్ జోహార్ కానీ.. హీరోయిన్ అనన్య పాండే కానీ 'లైగర్' గురించి పోస్టులు పెట్టలేదు.
'లైగర్' రిలీజ్ తర్వాత VD - పూరీ - చార్మీ కలిసి పెద్దమ్మ గుడికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కానీ బయటకు వచ్చేప్పుడైనా మీడియాతో మాట్లాడలేదు. ఇలా టీమ్ అంతా ఎలాంటి చప్పుడు చేయకపోవడంతో.. పరాజయాన్ని ఒప్పుకున్నట్టేనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లైగర్ లేవడం కష్టమని లైట్ తీసుకున్నారేమో అని సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు ట్రోలర్స్ లైగర్ ను ఆడుకుంటున్నారు. గతంలో విజయ్ దేవరకొండ అండ్ టీమ్ స్టేటమెంట్స్ ని మీమ్స్ గా మార్చి ట్రోల్ చేస్తున్నారు. ఆగ్ లగా దేంగే - వాట్ లగా దేంగే అంటూ ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు. అయితే వీరికి మరింత అవకాశం ఇవ్వడం ఎందుకులే అని మేకర్స్ సైలెంట్ గా ఉంటున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది.
'లైగర్' అనేది పూరీ మరియు విజయ్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుందని అందరూ భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.
సినిమా విడుదలైన రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథా కథనాలు బలంగా లేవని.. ఇదొక చెత్త సినిమా అని ప్రేక్షకులు సినీ విమర్శకులు తేల్చేశారు. అయితే సినిమాలన్నాక హిట్లు ఫ్లాపులు సహజం. VD - పూరీ దీన్నుంచి వీలైనంత త్వరగా బయటకు వచ్చి ఈసారి 'జనగణమన' తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.