అఖిల్ తరహాలోనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందా..?

Update: 2022-04-12 00:30 GMT
టాలీవుడ్ లో నట వారసులకు కొదువ లేదు. ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి - నాగార్జున వారసులు ఇప్పటికే హీరోలుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతోంది.

నందమూరి మూడో తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో ఇదుగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అంటూ మోక్షజ్ఞ తెరంగేట్రం గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు జరగలేదు. అయితే తనయుడి ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేస్తున్నానని అప్పట్లో బాలయ్య స్వయంగా వెల్లడించారు.

మోక్షజ్ఞ కోసం అద్భుతమైన స్క్రిప్ట్స్ తీసి పెట్టానని తెలిపారు. 'ఆదిత్య‌ 369' కు సీక్వెల్ గా తెరకెక్కే 'ఆదిత్య 999 మాక్స్' సినిమా ద్వారా కుమారుడి అరంగేట్రం ఉంటుందని.. 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

మోక్షజ్ఞ తొలి సినిమాకు తనే దర్శకత్వం వహిస్తానని బాలయ్య గతంలో చెప్పినా.. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. హీరోగా లాంచ్ చేయడానికంటే ముందుగా తన సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇప్పించాలని ఆలోచిస్తున్నారట.

'మనం' సినిమాలో అక్కినేని వారసుడు అఖిల్ క్యామియో ఇచ్చినట్లే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను నటించే చిత్రంతో మోక్షజ్ఞ ని తెర పైకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఇప్పటికే నందమూరి వారసుడు కసరత్తులు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. ఇప్పుడు జిమ్ క్లాసులు తీసుకుంటూ తన బరువు తగ్గించుకుంటున్నారట. అంతేకాదు ఇప్పటి నుంచీ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ట్రావెల్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.

ఇకపోతే మోక్షజ్ఞ ని పెద్ద బ్యానర్ లోనే హీరోగా లాంచ్ చేయడానికి బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారట. అది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లోనే ఉండే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'అన్ స్టాపబుల్' షోతో అల్లు ఫ్యామిలీతో బాలయ్యకు ఉండే సాన్నిహిత్యం అందరికీ తెలిసింది. త్వరలోనే అల్లు అరవింద్ నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు మోక్షు డెబ్యూ మూవీ గీతా ప్రొడక్షన్ లోనే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News