సినిమాలు వ‌దిలి పూర్తిగా జ‌నంలోకి సేనాని?

Update: 2020-12-21 01:30 GMT
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కు బ్రేకిచ్చి పూర్తిగా జ‌నంలోకి వెళ‌తారా? మ‌రోసారి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో హీట్ పెంచిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరిగి పొలిటిక‌ల్ వార్ కి సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే అందుకు అవును అనే స‌మాధానం వినిపిస్తోంది.

``2021 జనవరి నుండి పవన్ కళ్యాణ్ ప్రతి నెలా నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ దిశగా ప్రణాళిక వేస్తున్నామ``‌ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నదేండ్ల మనోహర్ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి జనసేనాని చివరకు సానుకూల నిర్ణయం తీసుకున్నారని అర్థ‌మ‌వుతోంది.

ఆయ‌న ప్ర‌క‌ట‌న బాగానే ఉంది కానీ.. ఆ ఒక్క ప్ర‌క‌ట‌న‌తో ఇప్ప‌టికే క‌మిట్ మెంట్లు ఉన్న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్ట‌డం ఖాయ‌మైంది. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళితే ఇప్ప‌టికే ఓకే స్క్రిప్టులు రెడీ చేస్తున్న ద‌ర్శ‌కుల స‌న్నివేశ‌మేమిటి? క్రిష్ తో మూవీని ఎప్ప‌టికి పూర్తి చేస్తారు? ఆపై హ‌రీష్ శంక‌ర్.. సురేంద‌ర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్ట‌ర్ల స‌న్నివేశ‌మేమిటి? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు.

మ‌రో కోణంలో చూస్తే జ‌న‌సేనాని నిర్ణ‌యం కూడా స‌రైన‌దేన‌ని అంగీక‌రించ‌క త‌ప్ప‌దు. నిజానికి ప్రజలను చేరుకోవడం కంటే రాజకీయ పార్టీకి గొప్ప ఆలోచన ఉండదు. జనసేనాని ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ప్ర‌తిసారీ ఏదో షో చేస్తున్నాం అని కాకుండా ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేయాలంటే గ్రామ మండ‌ల‌ స్థాయి.. నుంచే న‌రుక్కు రావాలి. మూల మూలాల్లో యువ‌త ఆద‌ర‌ణ ఉన్న జ‌న‌సేనాని దానిని స‌ద్వినియోగం చేసుకోవాలి. జనసేన స్థానిక నాయకుల సమావేశాలను నిర్వహించడానికి ప్రయత్నించాలి. మండల్ గ్రామ స్థాయిలో ఛార్జీలుగా నియమించాలి. ఇది ఎన్నికలలో జనసేనకు ఉపయోగపడుతుంది. ఇటువంటి పర్యటనలు సామాన్య ప్రజలకు తనను చేరుకోవడంలో ఉపయోగపడతాయి గ‌నుక‌ పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్త తీసుకోవాలి.

అన‌వ‌స‌ర హంగామా అస్స‌లు రాజ‌కీయాల్లో ప‌నికిరాదు. ఒక నెలలో పర్యటన ముగించి తరువాత చిత్రాలలో బిజీ అయితే ఫ‌లితం శూన్య‌మే అవుతుంది. ఈ పాఠాల‌న్నిటినీ ఔపోష‌ణ ప‌ట్టి జ‌న‌సైనికుడు తిరిగి యుద్ధం చేయాల‌న్న ఆకాంక్ష ప్ర‌జ‌ల్లో ఉంది. మ‌రి ప‌వ‌న్ ఇంకా సినిమాల దారిలో వెళ‌తారా? లేక జ‌న‌సైనికుడిగా ప్ర‌జా యుద్ధంలోకి దిగుతారా? అన్న‌ది చూడాలి.




Tags:    

Similar News