రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఇంకా టైమ్ ప‌డుతుందా?

Update: 2022-11-16 15:30 GMT
టాలీవుడ్ లో స్టార్ హీరోల‌తో పాటు టైర్ టు హీరోలు, యంగ్ హీరోలు, అప్ క‌మింగ్ హీరోలు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలే చేస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. కొన్ని సినిమాల‌ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు కూడా. మెగాస్టార్ చిరంజీవి నుంచి కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు ప్ర‌తీ హీరో చేతిలో సినిమాల‌తో బిజీగా వుంటున్నారు. అయితే ఒక్క హీరో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌క‌పోవడం గ‌మ‌నార్హం. త‌నే రానా ద‌గ్గుబాటి. గ‌త‌ ఏడాది 'అర‌ణ్య‌'తో ప్రేక్ష‌కుల ముంద‌కొచ్చాడు.

ఇక 2022లో రానా నుంచి ఏకంగా మూడు సినిమాలొచ్చాయి. త‌మిళ, తెలుగు బైలింగ్వ‌ల్ గా రూపొందిన '1945'మూవీ.. ఈ సినిమాని రానా మ‌ధ్య‌లోనే వ‌దిలేసినా మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ మాత్రం రానా సినిమా అంటూ ప్ర‌చారం చేసి అర‌కొర సీన్ ల‌తో విడుద‌ల చేసి చేతులు కాల్చుకున్నారు. రెజీనా హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌లై ఫ్లాప్ అనిపించుకుంది.  దీని త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి 'భీమ్లానాయ‌క్‌'లో న‌టించాడు.

మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌' ఆధారంగా ఈ మూవీని సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించాడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లై స‌క్సెస్ అనిపించుకుంది. ఇందులో రానా నెగెటివ్ షేడ్స్ వున్న డేనియ‌ల్ శేఖ‌ర్ గా క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. సినిమా స‌క్సెస్ అయితే అయింది కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది.

ఇక ఇదే ఏడాది రానా హీరోగా సాయి ప‌ల్ల‌వి కీల‌క పాత్ర‌లో న‌టించిన 'విరాట ప‌ర్వం'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో క్రేజ్.. బ‌జ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ థియేట‌ర్ల‌కు వ‌చ్చే స‌రికి ఆ క్రేజ్ కి త‌గ్గ ఫ‌లితాన్ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఈ సినిమాని చూడ‌టానికి ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం ఒక ద‌శ‌లో గ‌గ‌న‌మైంది కూడా.

ఈ మూవీ త‌రువాత ఇంత వ‌ర‌కు రానా త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌లేదు. బాబాయ్ వెంక‌టేష్ తో నెట్ ఫ్లిక్స్ కోసం 'రానా నాయుడు' వెబ్ సిరీస్ లో న‌టించాడు. ఫేమ‌స్ అమెరిక‌న్ క్రైమ్ డ్రామా 'రే డొనోవ‌న్' ఆధారంగా ఈ సిరీస్ ని నిర్మించారు. బీవీఎస్ ర‌వి స్క్రీన్ ప్లే అందించిన ఈ సిరీస్ ని క‌ర‌ణ్ అన్షుమ‌న్ క్రియేట్ చేయ‌గా సుప‌ర్ణ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమ‌న్ డైరెక్ట్ చేశారు. ఇటీవ‌లే టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీని త‌రువాతైనా రానా త‌న కొత్త ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టిస్తాడేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News