స్పెషల్‌స్టోరి: భవిష్యత్‌ స్టార్‌ డైరెక్టర్లెవరు?

Update: 2015-06-11 13:30 GMT
టాలీవుడ్‌లో అరడజను పైగానే స్టార్‌ డైరెక్టర్లున్నారు. అయితే వీళ్లంతా సీనియర్లు. రాజమౌళి, పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, శ్రీనువైట్ల, సుకుమార్‌... ఇంతకాలం వీళ్ల పేర్లు మాత్రమే వినిపించాయి. ఇకపోతే ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి చేరుతోంది. వచ్చే వాళ్లలో ప్రతిభావంతులైన దర్శకులకు కొదవేం లేదు. ఆరంగేట్రమే అదిరిపోయే సినిమాలు తీసినవారు కొందరైతే, కాస్త నెమ్మదిగా మొదలైనా జెట్‌ స్పీడ్‌తో కెరీర్‌ని మలుచుకునే తెలివితేటలున్న దర్శకులకు కొదవేం లేదు. అయితే వీళ్లలో పూరీ రేంజులోనో, త్రివిక్రమ్‌ స్థాయిలోనో, శ్రీనువైట్ల లాగానో ఎదిగేవాళ్లెందరు అనేది ఇప్పుడు ప్రశ్న.

నవతరం దర్శకుల పేర్ల చిట్టా తిరగేస్తే చాంతాడంత ఉంది. కానీ అందులో చాలా పేర్లు మిణుకుమిణుకుమని ఆరిపోయేవే ఎక్కువ కనిపిస్తున్నాయి. కొరటాల శివ, అనీల్‌ రావిపూడి, బాబి అలియాస్‌ కె.ఎస్‌.రవీంద్ర, సంపత్‌నంది, గోపిచంద్‌ మలినేని, హరీష్‌ శంకర్‌, వీరభద్రమ్‌, కృష్ణ చైతన్య, సుజిత్‌, చందు మొండేటి, సుధీర్‌వర్మ, పరశురామ్‌ .. ఇలా ఏవో కొన్ని పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీళ్లలో కృష్ణ చైతన్య, అనీల్‌ రావిపూడి, సుజిత్‌, చందు మొండేటి, సుధీర్‌ వర్మ ఇప్పుడిప్పుడిప్పుడే రైజింగ్‌ డైరెక్టర్స్‌గా ఎదుగుతున్నారు. వీళ్లలో బోలెడంత పొటెన్షియాలిటీ ఉందని తొలి ప్రయత్నాల్లోనే సాధించిన విజయాలు చూశాక అర్థమైంది. అయితే తమకంటూ ఓ మార్క్‌తో ఎదిగే దర్శకులు వీళ్లలో ఎందరు అన్నదే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.

ఇప్పటికే సీనియర్‌ దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ, పూరి, శ్రీను, వినాయక్‌ లాంటి దర్శకులు తీసేసిన సినిమాల్నే వీళ్లు తిరిగి తిప్పి తీస్తే కెరీర్‌ పరంగా ఖేల్‌ ఖతమ్‌.. దుకాణ్‌ బంధ్‌ అన్నట్టే అయిపోతుంది. కాబట్టి నవతరం ఎక్కువగా కొత్త కథలు, ఎవరూ చూపించని విజువల్స్‌పై దృష్టి సారిస్తేనే సక్సెస్‌ సాధించేది. బాబి, గోపిచంద్‌ మలినేని, హరీష్‌ శంకర్‌, సంపత్‌ నంది... సేఫ్‌గేమ్‌ ఆడేవాళ్లే. రెగ్యులర్‌ స్టఫ్‌తోనే విజయాలు అందుకోవాలని చూసే దర్శకులు. అందువల్ల వీళ్ల కంటే జాబితాలో ఉన్న మిగతా వాళ్లకే ఎక్కువ సంచలనాలు సృష్టించే అవకాశాలెక్కువ. కొరటాల శివ రెండో ప్రయత్నమే మహేష్‌తో కాస్త కమర్షియాలిటీ, మరికాస్త ప్రయోగాత్మకత ఉన్న కథని ఎంచుకున్నాడని అనిపిస్తోంది. శ్రీమంతుడు చిత్రం రిలీజయ్యాక అతడిలోని స్టామినా ఎంతో తెలుస్తుంది.

ఇప్పుడున్న దర్శకుల్లో త్రివిక్రమ్‌ రేంజులో కానీ, పూరి స్థాయిలో కానీ పంచ్‌లు రాసుకునేవాళ్లున్నారా? అంటే అనీల్‌ రావిపూడి, కృష్ణ చైతన్య పేర్లను పరిశీలనలోకి తేవొచ్చు. పటాస్‌, రౌడీ ఫెలో చిత్రాల్లో డైలాగులకు అద్భుతమైన స్పందన వచ్చింది. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ దర్శకరచయితలు.

కాస్త వెరైటీగా ఎవరైనా ఏమైనా చేస్తున్నారా అని పరిశీలిస్తే.. సుధీర్‌ వర్మ, చందు... రామ్‌గోపాల్‌ వర్మ తరహాలో కొత్త జోనర్‌లను ఎటెంప్ట్‌ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మునుముందు వీళ్ల  నుంచి ఎక్స్‌క్లూజివ్‌ అనిపించే సినిమాల్ని ఆశించవచ్చు. హరీష్‌ శంకర్‌, వీరభద్రమ్‌ చౌదరి వంటి దర్శకులు కూడా మనకు ఉన్నా.. ఈ దర్శకుల గురించి ఓ హిట్టుతో తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చాకే మాట్లాడాలి. ముందుగా మాట్లాడితే తొందరపాటు అవుతుంది. అది సంగతి.

Tags:    

Similar News