సూపర్ స్టార్ కి డూప్ గా అట్లీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ కి డూప్ గా అట్లీ నటించాడా? ఓ సినిమా మొత్తం అట్లీ సారథ్యంలోనే జరిగిందా? అంటే అవుననే తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కి డూప్ గా అట్లీ నటించాడా? ఓ సినిమా మొత్తం అట్లీ సారథ్యంలోనే జరిగిందా? అంటే అవుననే తెలుస్తోంది. అట్లీ స్టార్ మేకర్ శంకర్ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన వద్ద శిష్యరికం చేసే గొప్ప దర్శకుడు కాగలిగాడు. `రోబో` సినిమాకి శంకర్ వద్ద అట్లీ అసిస్టెంట్ గా పనిచేసాడు. ఆ సినిమాకి అట్లీతో పాటు ఇంకా చాలా మంది పనిచేస్తున్నారు. ఇంతలో సెట్ లో శంకర్ ..రజనీకాంత్ కి ఓ సీన్ వివరిస్తున్నారు.
అలా వివరించిన సన్నివేశాన్ని ఎవరైనా నటించి చేస్తే బాగుంటుందని శంకర్ భావించారు. ఆ సమయంలో ఆయన కంటికి ఎదురుగా నల్లగా..బక్కచిక్కి ఉన్న అట్లీ కనిపించాడు. ఈ మధ్యనే అసిస్టెంట్ గా చేరాడు. శంకర్ అతన్ని పిలిచి సీన్ చెప్పి నటించమని అడిగాడు. దీంతో అంత పెద్ద ఆర్టిస్టుల ముందు నేను నటించడమా? అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని స్టైల్ గా డైలాగ్ చెప్పి నటించి చూపించాడు ఆ కుర్రాడు.
ఆ సన్నివేశానికి రజనీకాంత్ నటించి మెరుగులు దిద్ది చేసారు. సీన్ బాగా వచ్చింది. దీంతో ఆ రోజు నుంచి రజనీ నటించబోయే ఏ సీన్ కైనా ముందు డూప్ అట్లీ చేయాలని నిర్ణయించారు. రోబో లో రజనీ నటించిన చాలా సన్నివేశాలకు అతడే ముందు డూప్ అయ్యాడు. ఇక అట్లీది మధురై. చెన్నై వచ్చి స్థిరపడ్డారు. తండ్రి ప్రయివేటు ఉద్యోగి. దిగువ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి ఆర్ధిక కష్టాలు. అయినా టెన్త్..ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు.
అలాగే అట్లీ మంచి డాన్సర్ కూడా. దీంతో సినిమాల్లోకి రావాలనుకున్నాడు. దానికి సహాయంగా ఉంటుందని బీఎస్సీ విజువల్ కమ్యునికేషన్ జాయిన్ అయ్యాడు. ఆ కోర్సు అతన్ని దర్శకత్వం వైపు ప్రయాణించేలా చేసింది. కాలేజీ ప్రాజెక్ట్ లో భాగంగా ఇంట్లో బంగారం గొలుసు అమ్మిమరీ ఓ షార్ట్ ఫిలిం తీసాడు. ఆ షార్ట్ ఫిలిం టైటిల్ కోసమే అరుణ్ కుమార్ కాస్త అట్లీగా మారాడు. ఆ షార్ట్ ఫిలిం జాతీయ స్థాయి పోటీల్లో నెగ్గింది. ఇదే తన బయోడేటాగా శంకర్ కి చూపించి అతని వద్ద అసిస్టెంట్ గా దిగిపోయాడు. అక్కడ నుంచి కష్టపడి పనిచేసి దర్శకుడిగా ఎదిగాడు.