'దొంగ చుట్టం' అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ ట్వీట్

తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖుల్లో ఒకరు బాబు గోగినేని

Update: 2024-06-06 13:00 GMT

తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖుల్లో ఒకరు బాబు గోగినేని. యాక్టివిస్టు కం హ్యుమనిస్టుగా పేరున్న ఆయన బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వటం ద్వారా సాదాసీదా ప్రజలకు సైతం సుపరిచితుడయ్యాడు. ఆయనలోని షేడ్స్ తో బిగ్ బాస్ షో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన బాబు గోగినేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక సంచలన ట్వీట్ చేశారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకొని గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన అభినందన ట్వీట్ కు షాకింగ్ రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తారక్ మీద సంచలన పోస్టు పెట్టారు. తారక్ పోస్టు చేసిన ట్వీట్ లో చంద్రబాబును ప్రియమైన మావయ్య అని.. బాలక్రిష్ణను బాబాయ్ అని.. పురంధేశ్వరిని అత్తగా పేర్కొంటూ వారు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు చెప్పారు.

అయితే.. ఈ ట్వీట్ కు తీవ్రమైన కౌంటర్ ఇచ్చారు బాబు గోగినేని. ఆయన పోస్టులో ఏమని పేర్కొన్నారంటే.. ‘ఏ తాత పేరు తనకు పెట్టారో.. ఆ తాత స్థాపించిన వైద్య విశ్వవిద్యాలయానికి ఉన్న తన తాత పేరును తీసేసి అప్పటి ముఖ్యమంత్రి తన సొంత తండ్రి పేరు పెట్టుకున్నప్పుడు విమర్శించటం కూడా చేతకాని ధైర్యం లేని హీరో. ఇప్పుడు ఫ్యామిలీ లవ్వు ఒలకపోస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. దీనికి దొంగ చుట్టం ట్వీట్ చేశాడన్న అర్థం వచ్చేలా టైటిల్ పెట్టి పోస్టు చేశారు.

Read more!

తారక్ అభిమానులు మాత్రం ఆయన్ను తప్పు పట్టటం సరికాదంటున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ను కానీ ఎప్పుడూ తారక్ శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టలేదని.. ఆయన ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉన్నట్లుగా వాదిస్తున్నారు. మరోవైపు.. పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు.. బయటకు రాని తారక్ ఎన్నికల్లో ఘన విజయాన్నిసాధించినంతనే శుభాకాంక్షలు చెప్పటాన్ని.. చంద్రబాబును మావయ్య అంటూ సంబోధించటాన్ని తప్పు పడుతున్నారు. ఏమైనా బాబు గోగినేని పోస్టు వైరల్ గా మారింది.

Tags:    

Similar News