హిందీ (X) తెలుగు: వరుణ్ ధావన్ 24కోట్లు.. తేజ సజ్జా 72 కోట్లు
మంచి కంటెంట్ ఉంటే కటౌట్ తో పనే లేదు. అభిరుచి కొత్తదనంతో తెరకెక్కే సినిమాలను ఆదరించేందుకు ప్రజలు ఎప్పుడూ వెనకాడరు.
మంచి కంటెంట్ ఉంటే కటౌట్ తో పనే లేదు. అభిరుచి కొత్తదనంతో తెరకెక్కే సినిమాలను ఆదరించేందుకు ప్రజలు ఎప్పుడూ వెనకాడరు. జనాదరణకు స్టార్ హీరోనా? చిన్న హీరోనా? అనే విభేధం లేనేలేదు. పాన్ ఇండియన్ ట్రెండ్ లో చిన్న హీరోలు కూడా 100 కోట్లు మించి వసూళ్లను తేగలరని నిరూపణ అవుతోంది.
2024 సంక్రాంతి బరిలో విడుదలైన తేజ సజ్జా - ప్రశాంత్ వర్మల సినిమా `హనుమ్యాన్` కేవలం నాలుగు రోజుల్లో 72 కోట్లు వసూలు చేయడం సిసలైన సంచలనం. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు సైతం ఈ స్థాయి ఓపెనింగులు తేవడం లేదు. రోజుకు 20కోట్లు కూడా తేలేని స్థితిలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ ఉన్నారు. ఇప్పుడు వరుణ్ ధావన్ లాంటి ట్యాలెంటెడ్ హీరో నటించిన బేబి జాన్ మొదటి నాలుగు రోజుల్లో కేవలం 24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తమిళ బ్లాక్ బస్టర్ తేరికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని `జవాన్` (1000 కోట్ల క్లబ్ సినిమా) దర్శకుడు అట్లీ ఎగ్జిక్యూట్ చేయగా, నవతరం దర్శకుడు తెరకెక్కించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ ఫేట్ ని వరుణ్ ధావన్ స్టార్ డమ్ కూడా మార్చలేకపోయింది.
ఏడాది ఆరంభంలో విడుదలైన ఒక చిన్న హీరో సినిమా సాధించిన ఆరంభ వసూళ్లను కూడా వరుణ్ ధావన్ అంతటి పాపులర్ హీరో సినిమా క్రిస్మస్ సీజన్ లో సాధించలేకపోయింది అంటే.. దేశంలో మారిన ట్రెండ్ ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనే లేదు డూడ్! అని ఇటీవల మేకర్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు అంటే దానికి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు కారణమని చెప్పవచ్చు.
మంచి కథల ఎంపిక, స్క్రీన్ ప్లే మ్యాజిక్, ఎమోషనల్ కనెక్టివిటీ చాలా ముఖ్యం. సరైన రిలీజ్ తేదీ కూడా సినిమాలకు ప్లస్ అవుతోంది. హనుమాన్ అద్భుతమైన కథ.. సింపుల్ స్క్రీన్‌ప్లే, విజువల్ బ్రిలియన్సీతో మ్యాజిక్ చేసింది. పాత్రల చిత్రణ ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్టయింది. ఈ సినిమా రిలీజయ్యేప్పటికి ఇలాంటి యూనిక్ క్వాలిటీ ఉన్న సినిమా మరొకటి పోటీ బరిలో లేకపోవడం కూడా ప్లస్ అయింది. ముఖ్యంగా విజువల్ గ్రాఫిక్స్ ని అద్భుతమైన క్వాలిటీతో తీసుకున్న ప్రశాంత్ వర్మ పనితనం కూడా ప్రధాన అస్సెట్ అని చెప్పాలి. సంక్రాంతి 2024 బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా లాంటి పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. మహేష్, వెంకటేష్, నాగార్జున లాంటి పెద్ద స్టార్ల సినిమాలు థియేటర్లలో ఆడుతున్నా తేజ సజ్జా లాంటి చిన్న హీరో నటించిన సినిమాని చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు. 2024లో అత్యంత స్ఫూర్తివంతమైన సినిమాగా హనుమాన్ ఆకర్షించగా, స్ఫూర్తివంతమైన హీరోగా తేజ సజ్జా, స్ఫూర్తినిచ్చే దర్శకుడుగా ప్రశాంత్ వర్మ మనసులు గెలిచారు. హనుమాన్ ఫుల్ రన్ లో 265 కోట్ల వసూళ్లను సాధించింది.