వీరమల్లు.. యానిమాల్ నటుడు సైలెంట్ గా క్లారిటీ ఇచ్చేశాడు
బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ 'యానిమల్' మూవీతో తెలుగు వెండితెరకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ 'యానిమల్' మూవీతో తెలుగు వెండితెరకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో బాబి డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. నిజానికి యానిమల్ కంటే ముందు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాతోనే బాబీ డియోల్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అది వీలుపడలేదు.
ఇదే విషయం గురించి యానిమల్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలిపాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబి డియోల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన మొగలుల రాజు ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ మధ్య షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
" యానిమల్ కంటే ముందే తాను ఓ తెలుగు సినిమా అంగీకరించానని, కానీ సగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ సినిమా ఆగిపోయిందని" తెలిపాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికి బాబీ తెలుగులో ఒప్పుకున్న మొదటి సినిమా అదే కాబట్టి అందరికి అర్ధమయ్యింది. మరోవైపు హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ మధ్యలోనే గుడ్ బై చెప్పినట్లు చాలా రోజులుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ సుమారు 50 శాతం వరకు పూర్తయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ క్రిష్ కి ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ తో పాటు జనసేన కార్యక్రమాలతో పవన్ బిజీగా ఉండడం త్వరలోనే ఏపీలో ఎన్నికలు ఉండడం ఈ సినిమా ఆగిపోవడానికి కారణమని చెబుతున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు.
కానీ తాజాగా బాబీ డియోల్ మాత్రం హరిహర వీరమల్లు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని చెప్పడంతో మరోసారి పవన్ సినిమా గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. కాగా హరిహర వీరమల్లు మూవీ మొగలుల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. సినిమాలో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఎం. రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.