పవన్ 'బ్రో' తో లెజెండ్రీ బాలచందర్ కనెక్షన్
బాలచందర్ శిష్యుడే సముద్రఖని. చాలా సంవత్సరాల క్రితం గురువు బాలచందర్ తో కలిసి సముద్రఖని ఒక నాటకం చూశాడట.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన 'బ్రో' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ కాంబో సన్నివేశాలు ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
తమిళంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న వినోదయ సిత్తం కు రీమేక్ గా రూపొందినప్పటికి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా... పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ వ్యవహారాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకోవడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా తో తమిళ్ లెజెండ్రీ డైరెక్టర్ బాలచందర్ కి కనెక్షన్ ఉందని దర్శకుడు సముద్రఖని పేర్కొన్నారు.
బాలచందర్ శిష్యుడే సముద్రఖని. చాలా సంవత్సరాల క్రితం గురువు బాలచందర్ తో కలిసి సముద్రఖని ఒక నాటకం చూశాడట. నాటకం అంతా పూర్తి అయిన తర్వాత సముద్ర ఖనిని ఎలా ఉందంటూ బాలచందర్ అడిగారట. అప్పుడు సముద్రఖని స్పందిస్తూ... కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ జనాలకు రీచ్ అవ్వాలంటే స్క్రీన్‌ప్లే లో మార్పులు చేసి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం చెప్పాడట.
అప్పుడు బాలచందర్ ఆ నాటక రచయితను పిలిచి కథ హక్కులను సముద్రఖనికి ఇప్పించి నువ్వు అయితే ఎలా దీనిని మార్చుతావో మార్చు అన్నట్లుగా చెప్పారట. సముద్రఖని దర్శకుడిగా నటుడిగా ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల 17 ఏళ్ల పాటు ఆ కథను అలాగే వదిలేయడం జరిగింది. గురువు గారు బాలచందర్ ఇచ్చిన టాస్క్ ను చాలా సంవత్సరాల తర్వాత వినోదయ సీతం గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
తమిళంలో భారీ స్టార్ కాస్ట్ లేకుండా... కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెట్టకుండా ఒక చిన్న బడ్జెట్ సినిమా గా రూపొందించడం జరిగింది. అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో త్రివిక్రమ్ కథ కు కాన్సెప్ట్ కు కనెక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ ను ఒప్పించడం జరిగిందట. అలా పవన్ కళ్యాణ్ బ్రో సినిమా తో లెజెండ్రీ డైరెక్టర్ బాలచందర్ కి కనెక్షన్ ఉన్నట్లు అయింది.