ఏపీ- తెలంగాణ వరదలు.. బాలయ్య కోటి విరాళం
నటసింహా నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రసీమలో ఐదు దశాబ్ధాల కెరీర్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
నటసింహా నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రసీమలో ఐదు దశాబ్ధాల కెరీర్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో సంచలనాలు.. రికార్డ్ బ్రేకింగ్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇటీవలే ఎన్బీకే 50 సత్కారం గురించి తెలిసిందే. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో తెలుగు సినీపరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి-వెంకీ-బాలయ్య ఒకే వేదికపై మెరిసారు.
తన అతిథులు, అభిమానులు అందరికీ బాలయ్య బాబు ధన్యవాదాలు తెలిపారు. ఇదే వేదికపై బాలయ్యతో చిరు ఫ్యాక్షన్ సినిమా చేయాలనుందని వ్యాఖ్యానించి అగ్నికి ఆజ్యం పోసారు. ఇప్పుడు బాలయ్య మరోసారి తన అభిమానుల కోసం ఎమోషనల్ నోట్ ని షేర్ చేసారు.
50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉందని బాలయ్య ఈ నోట్ లో అన్నారు. ఇన్నేళ్లుగా నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది.. వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఏపీ-తెలంగాణ విపత్తుకు కోటి విరాళం:
ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను... అని ప్రకటించారు. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని బాలయ్య ఆకాంక్షించారు. ఇప్పటికే తెలుగు చిత్రసీమ నుంచి అశ్వనిదత్ 25లక్షలు, ఎన్టీఆర్ 50లక్షలు వరద బాధితుల కోసం ఆర్థిక విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్లు లక్షల్లో విరాళాల్ని సీఎం నిధికి జమ చేస్తున్నామని ప్రకటించారు.