బాలయ్యను పిలవలేదా.. కుదరలేదా?
అయితే ఎంత మంది వచ్చినా అందరి దృష్టి ఒక్కరి మీదే ఉంది. అదే బాలకృష్ణ. ఆయన ఈ కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకు రెండు కళ్ల లాంటి వారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పౌరాణిక పాత్రల్లో నటించి ఎన్టీఆర్ చెరగని ముద్ర వేస్తే.. ప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు. అయితే గతేడాది ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరగగా.. ఈ ఏడాది ఏఎన్నార్ శత జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి.
నేడు(సెప్టెంబరు 20) అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై అక్కినేని గొప్పతన్నాన్ని చెప్పారు. అయితే ఎంత మంది వచ్చినా అందరి దృష్టి ఒక్కరి మీదే ఉంది. అదే బాలకృష్ణ. ఆయన ఈ కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గతంలోనూ ఏఎన్నార్ చనిపోయినపుడు చివరి చూపు కోసం కూడా బాలయ్య రాలేదు. అప్పట్లో ఈ విషయం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. మరి నాగార్జునతో ఎక్కడ చెడిందో ఏమో తెలీదు కానీ.. చాలా ఏళ్ల నుంచి వారిద్దరి మధ్య మాటలు లేవన్న వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. ఇద్దరూ ఎక్కడా కలవడం, కలిసి మాట్లాడుకోవడం దాదాపుగా కనపడలేదు.
పైగా ఆ మధ్య ఒక వేడుకలో అక్కినేని కుటుంబాన్ని అనవసర పదజాలం వాడుతూ బాలయ్య నోరు జారిన సంగతి తెలిసిందే. దానిపై పెద్ద వివాదమే అయింది. కానీ ఆ సమయంలో బాలయ్య.. ఏఎన్నార్‌కు తన పిల్లల కన్నా తానే ఎక్కువ ఇష్టమని చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇప్పుడేమే ఏఎన్నార్ శత జయంతి వేడుకల ఆరంభ కార్యక్రమానికి వెళ్లలేదు. మరి బాలయ్యను నాగార్జున ఆహ్వానించలేదా? లేక పిలిచినా వచ్చే తీరిక లేదా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు.
పైగా ఈ మధ్యే తేదేపా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అయిన అయిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలయ్య బాబు కూడా చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశ ఆ పనుల్లో బిజీగా ఉండటం వల్లే వచ్చి ఉండకపోవచ్చని కూడా అనుకుంటున్నారు.