ఆమె నుదిటిన రూపాయి బిళ్లంత బొట్టు సీక్రెట్!

భాను ప్రియ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాతే ఆ బొట్టు అల‌వాటు అయింద‌ని...ఇది మ్యాక‌ప్ ఆర్టిస్టుల నుంచి వ‌చ్చింద‌నే వాద‌నలు కూడా ఉన్నాయి.

Update: 2024-08-25 02:30 GMT

అల‌నాటి అందాల న‌టి భాను ప్రియ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎన్నో చిత్రాల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఆమె సినిమాలు చేసారు. ముఖ్యంగా భాను ప్రియ అంటూ నుదిటిన రూపాయి బిళ్లంత అంద‌మైన బొట్టు తో అప్ప‌ట్లో ఎంతో ఫేమ‌స్. ఆమె ముఖాన్ని గుండ్ర‌ని బొట్టు మ‌రింత అందంగా తీర్చి దిద్దేది. భాను ప్రియ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాతే ఆ బొట్టు అల‌వాటు అయింద‌ని...ఇది మ్యాక‌ప్ ఆర్టిస్టుల నుంచి వ‌చ్చింద‌నే వాద‌నలు కూడా ఉన్నాయి.

తాజాగా ఆ గుట్టు ఇంత కాలానికి వీడింది. భాను ప్రియ‌-రాజేంద్ర ప్ర‌సాద్ జంట‌గా `ప్రేమించు పెళ్లాడు` అనే సినిమాని వంశీ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సంగతుల్ని తాజాగా వంశీ పంచుకున్నారు.`కొవ్వూరు దగ్గర గోదావరిలో `వయ్యారి గోదారమ్మా ఒళ్లంతా ఎందుకమ్మా కలవరం` అనే పాటను చిత్రీకరించాలనుకున్నాం. దానికి అవ‌స‌ర‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయి. చెట్టు కొమ్మల మధ్యలో భానుప్రియ ఉంటుంది. చెట్టు క్రింద ఉన్న గ్రూప్ డాన్సర్ల మధ్యలోకి ఆమె దూకాలి. తెరపై అది స్లో మోషన్ లో ఉంటుంది. అది స్లో మోషన్ షాట్ అని ఆమెకి చెప్పలేదు. చెబితే ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ గా ప్రిపేరవు తూ ఉంటార‌ని చెప్పలేదు.

ఆ పాటలో భానుప్రియ చెట్టు పై నుంచి దూకారు. ఆ తరువాత లొకేషన్ షిఫ్టింగ్ ఉంది. ఆ సమయంలోనే నాకు తెలిసింది . భానుప్రియ జ్వరంతో బాధపడుతున్నారనీ అసలు ఆమె షూటింగ్ కు వచ్చే పరిస్థితి లేక‌పోయినా వచ్చారని దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అయితే తన గురించి షాట్స్ మార్చుకో వద్దనీ తాను చేస్తానని భానుప్రియ కబురు పంపారు. అంత జ్వరంలో ఆమె చేసిన ఆ పాట సూపర్ హిట్ అయింది.

అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను `దోసకాయలపల్లిలో` ప్లాన్ చేశాము. భానుప్రియ కట్టుకోవలసిన చీరను సెలెక్ట్ చేశాను. అదే సమయంలో భానుప్రియ వాళ్లమ్మగారు వచ్చి పెద్ద బొట్టు చూపించి ఇది ఆమెకి పెడితే బాగుంటుందా? అని నన్ను అడిగారు. సరే పెట్టండి అన్నాను. అంతే ఆ రోజు నుంచి భానుప్రియకి అదే 'పెద్ద బొట్టు' కంటిన్యూ అయింది. ఆ తరువాత సినిమాలలో కొంతమంది హీరోయిన్స్ కి పెద్దబొట్టు పెట్టి, తప్పు చేశానని అనిపించుకున్నాను` అని అన్నారు.

Tags:    

Similar News