మూవీ రివ్యూ : భారతీయుడు-2

28 ఏళ్ల కిందట ఇండియన్ స్క్రీన్ మీద శంకర్ ఆవిష్కరించిన అద్భుతం.. భారతీయుడు. పేరుకు తమిళ చిత్రమే కానీ.. దేశవ్యాప్తంగా ఆ సినిమా సంచలన విజయం సాధించింది.

Update: 2024-07-12 06:26 GMT

'భారతీయుడు-2' మూవీ రివ్యూ

నటీనటులు: కమల్ హాసన్- సిద్దార్థ్- రకుల్ ప్రీత్- ఎస్.జె.సూర్య-బాబీ సింహా-ప్రియ భవానీ శంకర్- సముద్రఖని- కాళిదాస్ జయరాం- వివేక్- నెడుముడి వేణు తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: రవివర్మన్

మాటలు: హనుమాన్ చౌదరి

నిర్మాత: సుభాస్కరన్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శంకర్

28 ఏళ్ల కిందట ఇండియన్ స్క్రీన్ మీద శంకర్ ఆవిష్కరించిన అద్భుతం.. భారతీయుడు. పేరుకు తమిళ చిత్రమే కానీ.. దేశవ్యాప్తంగా ఆ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఇన్నేళ్ల తర్వాత అందులో కథానాయకుడిగా నటించిన కమల్ హాసన్ తోనే ఆ చిత్ర దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందించాడు. ఈ రోజే మంచి అంచనాల మధ్య 'భారతీయుడు-2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 'భారతీయుడు' లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

అరవింద్ (సిద్దార్థ్) తన మిత్ర బృందంతో కలిసి బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ.. సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగులోకి తెస్తుంటాడు. కానీ అక్రమార్కుల ఆట కట్టించాలని అతను చేసే ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఒకప్పుడు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన సేనాపతి (కమల్ హాసన్) తిరిగొస్తేనే దేశం మళ్లీ గాడిన పడుతుందని అతను భావిస్తాడు. అందుకోసం 'కమ్ బ్యాక్ ఇండియన్' పేరుతో ఒక సోషల్ మీడియా ఉద్యమాన్ని మొదలుపెడతాడు. తన ప్రయత్నం ఫలించి చైనీస్ తైపీలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రంలో ఉన్న సేనాపతి ఇండియాకు తిరిగి రావడానికి నిర్ణయించుకుంటాడు. మరి దేశంలో అడుగుపెట్టిన సేనాపతి.. ఇక్కడ ఎదురైన పరిస్థితులు చూసి ఎలా స్పందించాడు.. ఆయన రాకతో వచ్చిన మార్పులేంటి.. ఆయనకు ఎదురైన సవాళ్లేంటి.. వాటిని సేనాపతి ఎలా ఛేదించాడు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

'భారతీయుడు-2 ప్రి క్లైమాక్సులో ఒక సన్నివేశం.. వందేళ్లు వయసు పైబడ్డ సేనాపతిని వందల మంది పోలీసులు పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని చుట్టుముడితే.. ఆయన చాలా సింపుల్ గా తప్పించేసుకుంటారు. ఆ తర్వాత వెనుక పదుల సంఖ్యలో వాహనాల్లో పోలీసులు తనను వెంటాడుతుంటే.. సింపుల్ గా స్కేటింగ్ స్కూటరేసుకుని ఎవ్వరికీ చిక్కకుండా దూసుకెళ్లిపోతాడు. సినిమాలన్నాక లాజిక్కులు ఉండవని ఎంత సర్దిచెప్పుకుందామనుకున్నా.. ఆ సీన్లు మింగుడు పడవు. 'రోబో' లాంటి సినిమాల్లో అద్భుతమైన ఛేజింగ్ సీన్లు తీసిన శంకరేనా ఈ సీన్లు కూడా తీశాడు అని ఆశ్చర్యపోతుండగా.. భారతీయుడిని చుట్టుముట్టిన వందలమంది జనం.. ఆయన మీదికి రాళ్లేస్తారు.. కర్రలు విసురుతారు.. చీపుర్లతో కూడా ఆయన్ని కొట్టే ప్రయత్నం చేస్తారు.. అందుకు దారితీసిన కారణాలేంటన్నది పక్కన పెడితే.. ఈ సీన్ చూశాక సేనాపతి పాత్రను అమితంగా ప్రేమించి గుండెల్లో దానికి గుడి కట్టిన ఏ ప్రేక్షకుడికైనా మనసు చివుక్కుమనక మానదు. ఎలాంటి భారతీయుడికి ఎలాంటి గతి పట్టించావు శంకరా అని దర్శకుడిని తిట్టుకోని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. పాత క్లాసిక్ సినిమాలను రీమేక్ చేయడం.. లేదా వాటికి సీక్వెల్స్ తీయడం ద్వారా ఈ తరం దర్శకులు-నటులు వాటిని నాశనం చూశాం కానీ.. శంకర్ లాంటి మేటి దర్శకుడు-కమల్ లాంటి లెజెండరీ నటుడు కలిసి నిర్మించిన 'భారతీయుడు' అనే సుందర సౌధాన్ని సీక్వెల్ పేరుతో కూల్చేయడానికి చూడడం విచారకరం.

'భారతీయుడు' అంటే ఒక గొప్ప కథను వెండి తెర మీద ఆవిష్కరించిన అద్భుత చిత్రం. చూస్తున్నది కల్పిత పాత్రే అయినా అది మన మధ్య తిరుగుతున్నట్లు ఫీలయ్యి.. నిజంగా ఇలాంటి వ్యక్తి మధ్య ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేసిన పాత్ర సేనాపతిది. అందులో సెంటిమెంట్ చూస్తే కళ్లు తడి అవుతాయి. యాక్షన్ సన్నివేశాలకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎమోషన్.. రొమాన్స్.. కామెడీ.. అందులో లేనిది ఏమిటి? ఇక పాటలు-నేపథ్య సంగీతం గురించి చెప్పేదేముంది? నటులు.. టెక్నీషియన్లు.. ప్రతి ఒక్కరూ నూటికి రెండొందల శాతం ప్రతిభను చాటిన సినిమా చిత్రమది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఆ స్థాయిలో కాకపోయినా.. అందులో సగమైనా 'కంటెంట్' ఆశిస్తాం కదా? కానీ పావు వంతు కూడా 'భారతీయుడు' తాలూకు అనుభూతిని ఇవ్వని సినిమా 'భారతీయుడు-2'. సినిమాకు శంకర్ 'జీరో టాలరెన్స్' అని క్యాప్షన్ పెట్టాడు కానీ.. నిజానికి 'జీరో ఎమోషనల్ కనెక్ట్' అని పెట్టాల్సిన స్థాయిలో ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాని విధంగా కథాకథనాలను తయారు చేసి పెట్టాడు శంకర్. 'రోబో' తర్వాత శంకర్ సినిమాల్లో పదును తగ్గుతూ వస్తోందని తెలుసు. కానీ ఐ.. 2.0 సినిమాల్లో కూడా అక్కడక్కడా శంకర్ మార్కు కనిపిస్తుంది. కానీ మూడు గంటల సినిమాలో శంకర్ మెరుపులేవీ లేకుండా అత్యంత సాధారణంగా సాగిపోయిన సినిమా.. భారతీయుడు-2. మూడు దశాబ్దాల శంకర్ కెరీర్లో అట్టడుగున నిలిచే చిత్రం ఇది అనడానికి లేశమాత్రమైనా సంకోచించాల్సిన అవసరమే లేదు.

'భారతీయుడు' సీక్వెల్ ను నిజానికి ఒక్క సినిమాగానే తీయాలనుకున్నాడు శంకర్. కానీ మధ్యలో అది రెండు భాగాలుగా మారింది. శంకర్ సినిమాలంటే ఆటోమేటిగ్గా బడ్జెట్లు పెరగడం కామన్. పైగా 'భారతీయుడు-2' సెట్లో జరిగిన ప్రమాదం.. కొవిడ్ పుణ్యమా అని రెండేళ్లకు పైగా ఆగి బడ్జెట్ తడిసి మోపెడైంది. ఆ స్థితిలో ఒక్క సినిమాగా తీస్తే ఆర్థికంగా గిట్టుబాటు కాదని రెండు భాగాలుగా చేయాలనుకున్నారేమో కానీ.. 'ఇండియన్-2' చూస్తుంటే మాత్రం ఈ కథను బలవంతంగా సాగదీసిన సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది. 'భారతీయుడు'లో మాదిరే ఇందులోనూ సేనాపతి అక్రమార్కులను ఒక్కొక్కరిగా చంపుతూ వెళ్తాడు. అలా చంపే సన్నివేశం ఒక్కోటి పావు గంట పాటు నడుస్తుందంటే.. అవెంత సాగతీతగా అనిపిస్తాయో అంచనా వేసుకోవచ్చు. కమల్ ఏదో వేషం వేసుకుని ఎంట్రీ ఇవ్వడం.. చావబోయే వ్యక్తి పాపాలన్నింటినీ తీరికగా ఏకరవు పెట్టడం.. తాపీగా చంపి అక్కడ్నుంచి సునాయాసంగా తప్పించుకుని వెళ్లిపోవడం.. ఇదీ వరస. సినిమా మొత్తంలో సేనాపతి చేసేది ఇంకేమీ ఉండదు కూడా. 'భారతీయుడు' సినిమాలో ప్రేక్షకుడిలో ఒక ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఈ పాత్ర.. సీక్వెల్లో మాత్రం మినిమం ఎమోషనల్ కనెక్ట్ లేకుండా జస్ట్ హత్యలు చేసే ఒక కిల్లర్ తరహాలో కనిపించడమే విడ్డూరం. ప్రధాన పాత్రతో ప్రేక్షకులకు భావోద్వేగ బంధం ఏర్పడకుండా ఇక సినిమాను ప్రేక్షకుడు ఏం ఆస్వాదిస్తాడు?

భారతీయుడు అక్రమార్కుల పని పట్టి వెళ్లిపోయి ఎన్నో ఏళ్లు గడిచాక.. వర్తమానంలో పరిస్థితులు ఇంకా దుర్భరంగా ఉన్నట్లు చూపిస్తూ.. ఆయన మళ్లీ రావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ 'భారతీయుడు-2' మొదలవుతుంది. ఇక్కడి వరకు సినిమా బాగానే అనిపిస్తుంది. భారతీయుడి పునరాగమనానికి తగ్గ ప్లాట్ సిద్ధమైనట్లే కనిపిస్తుంది. ఇక సేనాపతి ఎంట్రీతో సినిమా వేరే లెవెల్ కు వెళ్తుందని అనుకుంటే.. ఆయన ఎంట్రీ సీనే తుస్సుమనిపించేస్తుంది. భారతీయుడికి ఏమాత్రం సూట్ కాని చైనీస్ కుంఫూ మాస్టర్ తరహా ఆహార్యంతో కమల్ ఎంట్రీతోనే ప్రేక్షకులు జావగారిపోతారు. ఇంట్రో సీన్ మిస్ ఫైర్ అయినా.. తర్వాత భారతీయుడు ఇండియాలోకి అడుగు పెట్టి తన ఒరిజినల్ అవతారంలోకి మారాక వ్యవహారం మారుతుందిలే అనుకుంటే.. ఆ తర్వాత సన్నివేశాలు మరింత చప్పగా సాగుతాయి. ఓవైపు సేనాపతి హత్యలు చేసే సన్నివేశాలు విసుగు పుట్టిస్తుంటే.. ఇంకోవైపు సిద్ధు అండ్ గ్యాంగ్ తమ ఇంట్లో వ్యక్తుల మీదే నిఘా పెట్టి అవినీతి అధికారులకు పట్టించే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి మరింతగా పరీక్ష పెడతాయి. మనం చూస్తున్నది సినిమానా.. సీరియలా అని అనుమానం కలిగే స్థాయిలో 'భారతీయుడు-2' ద్వితీయార్ధం విపరీతమైన సాగతీతతో సాగుతుంది. ప్రి క్లైమాక్సుకు వచ్చేసరికి ప్రేక్షకుల ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళ్లిపోతుంది. భారతీయుడి మీద జనం తిరుగుబాటు చేసే సన్నివేశాలు చూస్తే.. శంకర్ అసలీ సినిమాతో ఏం చెప్పదలుచుకున్నాడా అని సందేహం కలుగుతుంది. ముగింపు సన్నివేశాల్లోనూ ప్రేక్షకులు ఆశించే మెరుపులు ఏమీ లేవు. ఈ కథను మధ్యలో ఆపి పార్ట్-3లో ఏదో ఎగ్జైటింగ్ గా ఉందన్నట్లుగా ఒక ట్రైలర్ వదిలాడు శంకర్. కానీ 'భారతీయుడు-2'ను భరించాక.. 'భారతీయుడు-3' కోసం థియేటర్లకు వెళ్లే సాహసం ప్రేక్షకులు చేస్తారా అన్నదే సందేహం.

నటీనటులు:

'భారతీయుడు'లో సేనాపతి పాత్రలో ముఖాన్ని ప్రోస్థెటిక్ మేకప్ కప్పేసినా కమల్ హాసన్ హావభావాలు పలికించగలిగాడు. తన బాడీ లాంగ్వేజ్ తోనే ఆ పాత్రకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చాడు. ఆ పాత్రతో ప్రేక్షకులకు ఏర్పడ్డ ఎమోషనల్ కనెక్ట్ కూడా దాన్ని ఓన్ చేసుకోవడానికి ఉపయోగపడింది. మరోవైపు తండ్రీ కొడుకులుగా నటించడం ద్వారా నటన పరంగా ఎంతో వైవిధ్యం కూడా చూపించగలిగాడు కమల్. కానీ 'భారతీయుడు-2'లో ఇవన్నీ మిస్సయ్యాయి. ఈసారి సేనాపతి పాత్రకు చాలా చోట్ల మేకప్పే సరిగా కుదరలేదు. కొన్ని సన్నివేశాల్లో ఆ పాత్ర స్క్రీన్ మీది నుంచి వెళ్లిపోతే బాగుంటుందనిపిస్తుంది. కమల్ కష్టాన్ని తక్కువ చేయడం కాదు.. ఆయన బాగా నటించలేదనీ కాదు.. మేకప్ కుదరకపోవడం.. పాత్రలో డెప్త్ లేకపోవడం వల్ల ఈసారి సేనాపతిగా ఆయన మెప్పించలేకపోయాడన్నది కఠిన వాస్తవం. సిద్ధార్థ్ అరవింద్ పాత్రలో బాగానే చేశాడు. అతడికి జోడీగా నటించిన రకుల్ ప్రీత్ పాత్ర నామమాత్రం. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సిద్ధు స్నేహితులుగా ప్రియ భవానీ శంకర్.. జగన్.. మరో నటుడు బాగానే చేశారు. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్యకు పార్ట్-2లో చెప్పుకోదగ్గ రోల్ లేదు. అతను పార్ట్-3లో హైలైట్ అవుతాడని ముందే చెప్పిన సంగతి తెలిసిందే. సీబీఐ అధికారి పాత్రలో బాబీ సింహా పర్వాలేదు. సముద్రఖని బాగా చేశాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే చనిపోయిన వివేక్.. నెడుముడి వేణు.. మనోబాల.. ప్రత్యేకతేమీ కనిపించలేదు సినిమాలో.

సాంకేతిక వర్గం:

యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ పూర్తిగా నిరాశపరిచిన చిత్రాల్లో 'ఇండియన్-2' ముందు వరుసలో ఉంటుంది. పిండికొద్దీ రొట్టె అన్నట్లు.. సినిమా ఔట్ పుట్ చూశాకే ఈ పాటలు ఇచ్చాడా అని సందేహం కలిగేలా ఉన్నాయి పాటలు. నేపథ్య సంగీతం బాగా చేయడానికి సన్నివేశాలు ఉత్సాహాన్నిచ్చి ఉండకపోవచ్చేమో కానీ.. పాటలు కూడా తన శైలికి విరుద్ధంగా ఇంత డల్లుగా ఎలా ఇచ్చాడన్నది అర్థం కాని విషయం. అసలే నీరసంగా.. సాగతీతగా సాగే సన్నివేశాలను తన బీజీఎంతోనూ లేపలేకపోయాడు అనిరుధ్. రవివర్మన్ ఛాయాగ్రహణం మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజిలో ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో భారీతనం కనిపిస్తుంది. కానీ ఆ భారీతనం వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. హనుమాన్ చౌదరి డైలాగ్స్ పర్వాలేదు. దర్శకుడు శంకర్ గురించి ఏం చెప్పాలి? ఒకసారి 'భారతీయుడు'ను గుర్తు చేసుకుని చూస్తే.. కథ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ నాటి తన ప్రమాణాలకు ఆయన ఎంత దిగువన ఉన్నాడో అర్థమవుతుంది. కథతో.. ప్రధాన పాత్రతో ప్రేక్షకులకు బలమైన బంధం వేసే మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పేరున్న శంకర్.. ఈసారి ఎంతమాాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. శంకర్ కెరీర్లో ఇంతకుముందు ఫెయిల్యూర్లు ఉండొచ్చు కానీ.. ఆయన ఇంత సాగతీతగా.. ప్రేక్షకులు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయేలా ఏ సినిమాను డీల్ చేసింది లేదు. ఎప్పుడూ శంకర్ సినిమాల్లో కనిపించే 'షార్ప్ నెస్' ఈ సినిమాలో ఎంతమాత్రం లేకపోయింది.

చివరగా: భారతీయుడు-2.. జీరో ఎమోషనల్ కనెక్ట్

రేటింగ్- 2/5

Tags:    

Similar News