గుండె పోటుతో 30 ఏళ్ల నటుడు మృతి
సుదీప్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత వ్యక్తి అందించిన సమాచారం ప్రకారం.. అతడు గుండెపోటుతో మరణించినట్ట తెలిసింది.
ఆకస్మిక గుండెపోటుతో పలువురు నటులు వేదికలపైనే కుప్పకూలిన ఘటనలను చూశాం. ఇప్పుడు భోజ్‌పురికి చెందిన ప్రముఖ నటుడు సుదీప్ పాండే అతి పిన్న వయసులో గుండెపోటుతో మరణించారు. సుదీప్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత వ్యక్తి అందించిన సమాచారం ప్రకారం.. అతడు గుండెపోటుతో మరణించినట్ట తెలిసింది.
సుదీప్ 2007లో భోజ్‌పురి చిత్రం `భోజ్‌పురియా భయ్యా`తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. యాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్యార్ మే, బల్వా, ధర్తి సహా పలు భోజ్‌పురి చిత్రాలలో నటించాడు. 2019లో అతడు హిందీ చిత్రం వి ఫర్ విక్టర్‌లో కనిపించాడు. అతడు ఇటీవల `పారో పట్నా వాలి` రెండవ భాగం చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. 30 ఏళ్లకే అతడు భోజ్ పురిలో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా పాపులరయ్యాడు.
అతడి ఆకస్మిక మరణ వార్త విని అభిమానులను తీవ్ర విచారంలో మునిగిపోయారు. ``రిప్... మీ ఆత్మకు శాంతి చేకూరుగాక`` అని ఒక అభిమాని సోషల్ మీడియాలో రాశాడు. చాలా త్వరగా వెళ్ళిపోయాడు అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. సుదీప్ మరణంపై కుటుంబం నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇంతకుముందు 46 ఏళ్ల కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ శుక్లా, రాజీవ్ కపూర్, రాజు శ్రీవత్సవ్, సతీష్ కౌశిక్ వంటి నటులు గుండెపోటుతో మరణించారు.