క‌ల్కి ఈవెంట్లో 81 ఏళ్ల అమితాబ్ అవాక్క‌య్యేలా..!

ఒకానొక స‌మ‌యంలో నిర్మాత అశ్వ‌నిద‌త్ కాళ్ల‌కు మొక్కారు అమితాబ్. ఇది అహూతుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Update: 2024-06-19 16:31 GMT

మోస్ట్ అవైటెడ్ 2024 చిత్రం 'కల్కి 2898 AD' జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 19న ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లెజెండ్స్ పాల్గొన్నారు. అలాగే ఈ సైన్స్ ఫిక్ష‌న్ సినిమా కోసం రాజీ అన్న‌దే లేకుండా పెట్టుబ‌డుల్ని స‌మీక‌రించిన నిర్మాత అశ్వ‌నిద‌త్ కి స‌ముచిత గౌర‌వం ద‌క్కింద‌ని చెప్పాలి.

50 ఏళ్ల వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు, చిత్ర నిర్మాత సి అశ్వని దత్ ఈ వేదిక‌పై ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె సహా ఇత‌ర తారాగ‌ణం టెక్నీషియ‌న్లు ముంబై ఈవెంట్లో పాల్గొన్నారు. వేదిక‌పై అమితాబ్ స్పీచ్ తో పాటు ఆయ‌న విన‌యం ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించాయి. ఒకానొక స‌మ‌యంలో నిర్మాత అశ్వ‌నిద‌త్ కాళ్ల‌కు మొక్కారు అమితాబ్. ఇది అహూతుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కల్కి 2898 ADలో మొదటి టిక్కెట్టు ను అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసారు. క‌ల్కి లో అశ్వత్థామ పాత్రను పోషించిన భారతీయ సినీపరిశ్రమ అనుభవజ్ఞుడు, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు మొదటి టిక్కెట్‌ను నిర్మాతలు వేదిక‌పై అందించారు. ఆ స‌మ‌యంలో వెంటనే తన పర్సు తెరిచి టిక్కెట్‌ను తీసుకుంటూ గౌరవప్రదంగా నిర్మాతకు డబ్బు ఇచ్చారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

కమల్ హాసన్ కూడా ఈ ఈవెంట్ లో మొదటి టికెట్ అందుకున్నారు. చాలా కాలంగా అమితాబ్ బచ్చన్ తన స్నేహితుడు, సహ‌న‌టుడు అయిన‌ కమల్ హాసన్‌కు టికెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. టికెట్‌ను తీసుకున్న‌ కమల్ ''బచ్చన్ సర్ షోలే సినిమా చూసేందుకు టిక్కెట్ పొందడానికి మూడు వారాలు పట్టింది. కాబట్టి 40 ఏళ్ల క్రితం ఈ పద్ధతి ఉండేదని అనుకుంటున్నాను. నేను అప్పుడు సాంకేతిక నిపుణుడిని.. ఇప్పుడు నటుడిని.. కానీ ఏమీ మారలేదు.. అమితాబ్ పై నాకున్న అభిమానం మార‌లేదు!'' అని అన్నారు.

ఆస‌క్తిక‌రంగా ఈ వేదిక‌పై అమితాబ్ బచ్చన్ .. త‌న నిర్మాత అశ్విని దత్ పాదాలను తాకడానికి ప్ర‌య‌త్నించడం మీడియా స‌హా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వేలాది మంది అభిమానుల దృష్టిని నిజంగా ఆకర్షించింది. అమితాబ్ బచ్చన్ నిర్మాత అశ్వనీ దత్ కి ఇచ్చిన గౌర‌వం అది. బిగ్ బి వైజయంతీ మూవీస్ అధినేత అశ్విని దత్ గురించి గొప్ప‌గా మాట్లాడడమే కాకుండా అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. అశ్విని దత్ వయసు 73 ఏళ్లు కాగా, అమితాబ్ బచ్చన్ వయసు 81 ఏళ్లు.

ముంబై ఈవెంట్లో నిర్మాత అశ్వ‌ని దత్ మాట్లాడుతూ..''అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపిక నలుగురూ ఇక్కడ వుండటం, అందరి సమక్షంలో ఈ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. కల్కి 2898 AD యూనిట్ సభ్యులంతా పాల్గొనగా ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.

Tags:    

Similar News