ఈసారి ద‌ళ‌ప‌తికి విల‌న్.. షాకిస్తున్న బాబి లైన‌ప్!

ర‌ణ‌బీర్ త‌ర్వాత సూర్య‌, ప‌వ‌న్ క‌ల్యాణ్, బాల‌కృష్ణ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో అవ‌కాశాలు అందుకున్నాడు బాబి డియోల్.

Update: 2024-09-14 14:30 GMT

ర‌ణ‌బీర్ త‌ర్వాత సూర్య‌, ప‌వ‌న్ క‌ల్యాణ్, బాల‌కృష్ణ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో అవ‌కాశాలు అందుకున్నాడు బాబి డియోల్. ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ అత‌డికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాడు. అది కూడా త‌న సినిమాలో విల‌న్ గా న‌టించాల‌ని ఆహ్వానం పంపాడు. యానిమ‌ల్ అబ్రార్ గా అత‌డి న‌ట‌న అంద‌రికీ ఎంత పిచ్చిగా న‌చ్చిందో చెప్పుకునేందుకు ఇది చాలు.

సూర్య‌తో `కంగువ‌`, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`, బాల‌కృష్ణ‌- బాబి డియోల్ సినిమా త‌ర్వాత ద‌ళ‌ప‌తితో అవ‌కాశం అరుదైన ఛాన్స్. ఈ అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటే అత‌డి హ‌వా మ‌రింత‌గా పెరుగుతుందే కానీ త‌ర‌గ‌దు. ఈ సినిమాల్లో బాబి భయంకరమైన విలన్‌గా క‌నిపించ‌నున్నారు.

సూర్య నటించిన కంగువ చిత్రంతో తమిళ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్న బాబీ డియోల్, కోలీవుడ్ ని ఏల్తున్న విజయ్‌తో అదే ప‌రిశ్ర‌మ‌లో మరో చిత్రాన్ని చేజిక్కించుకోవ‌డం అత‌డి స్థాయిని ఎలివేట్ చేస్తోంది. విజ‌య్ న‌టించిన `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (గోట్) ఇటీవ‌లే విడుద‌లై త‌మిళంలో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఇంత‌లోనే విజయ్ త‌దుప‌రి `ద‌ళ‌పతి 69`లో బాబి న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతూ వినోద ప్రపంచానికి వీడ్కోలు పలికే క్ర‌మంలో ద‌ళ‌ప‌తి 69వ సినిమా అత‌డికి చివ‌రిది కానుంద‌ని తెలుస్తోంది. ఇలాంటి క్రేజీ చిత్రంలో బాబీ డియోల్ అవ‌కాశం అందుకున్నాడు.

ద‌ళ‌ప‌తి 69 చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈరోజు సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటలకు మేకర్స్ ఈ సినిమాని ప్రకటిస్తారని తెలుస్తోంది. తీరన్ అధిగారం ఒండ్రు, వాలిమై, తునివు వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 2025 దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కంగువ‌ అక్టోబర్ 11న థియేటర్లలోకి రావాల్సి ఉండగా ఇప్పుడు వాయిదా పడింది. తెలుగులో హరి హర వీర మల్లు, NBK109 సినిమాల‌లోను బాబి న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News