కిడ్నాప్ గ్యాంగ్ వల.. పాపులర్ నటుడు జస్ట్ మిస్!
హిందీ చిత్రసీమలో హాస్యనటుల మిస్సింగ్ కేసులు ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
హిందీ చిత్రసీమలో హాస్యనటుల మిస్సింగ్ కేసులు ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈవెంట్ ఇన్విటేషన్ల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు, విమాన టిక్కెట్లు పంపి సినీ తారలను కిడ్నాప్ చేసే ముఠా గుట్టు రట్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈవెంట్ అతిథులుగా ఆహ్వానించి దారిలో కిడ్నాప్ చేసి, అటుపై డబ్బు గుంజడం కిడ్నాపర్ల స్టైల్. సినీపక్కీలో కిడ్నాపర్ల మాస్టర్ ప్లాన్ కి పోలీసులు సైతం బిత్తరపోయారు. హాస్యనటులు ముస్తాక్ ఖాన్, సునీల్ పాల్ లను ఇప్పటికే కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం నుంచి నటుడు ముస్తాక్ మహ్మద్ ఖాన్‌ను కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో బందీగా ఉంచి, అతడిని విడిచిపెట్టాలంటే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసిన ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు తాజా ప్రకటనలో పోలీస్ అధికారులు తెలిపారు.
నటుడు ముస్తాక్ ఖాన్ ఈవెంట్ మేనేజర్ శివమ్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుల ముఠాను అరెస్ట్ చేసామని వెల్లడించారు. శివమ్ యాదవ్ ఫిర్యాదు ప్రకారం...నటుడు మిస్టర్ ఖాన్‌ను మీరట్‌లో ఒక ఈవెంట్‌కు ఆహ్వానించడానికి లావి అలియాస్ రాహుల్ సైనీ అక్టోబరు 15న రూ. 25 వేల అడ్వాన్స్ ను ఇవ్వడమే గాక, విమాన టిక్కెట్‌ను పంపాడు. నవంబర్ 20న దిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే మీరట్ - దిల్లీ మధ్య ఉన్న ప్రసిద్ధ `షికంజీ` దుకాణానికి తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ ముస్తాక్‌ను కిడ్నాప్ చేసారు. అక్కడ నటుడు ఖాన్ ను మరొక వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. అదే చోట ఎక్కువ మంది వ్యక్తులు అతడితో చేరారు. కిడ్నాప్ చేశాక అతడిని బెదిరించి డబ్బు డిమాండ్ చేసారని, ఈ కేసులో ప్రమేయం ఉన్న క్రిమినల్ లావి ఇంట్లో బందీగా ఉంచారని పోలీసులు తెలిపారు.
డబ్బు దోపిడీ కోసం కిడ్నాపర్లు ముస్తాక్ ఖాన్ బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్ తీసుకున్నారు. నవంబర్ 20 రాత్రి నిందితుడు మద్యం సేవించి నిద్రపోయాడు. దీంతో మరుసటి రోజు ఉదయం ముస్తాక్ ఖాన్ తప్పించుకోగలిగాడు. అతడు మొహల్లా చహ్షిరిలోని మసీదుకు చేరుకున్నాడు. అక్కడ స్థానికులను సంప్రదించగా వారు అతడిని ఇంటికి చేరుకోవడానికి సహకరించారు. నవంబర్ 21న కిడ్నాపర్లు మీరట్ , ముజఫర్‌నగర్‌లో షాపింగ్ చేసి ముస్తాక్ ఖాన్ బ్యాంక్ ఖాతా నుండి రూ. 2.2 లక్షలు విత్‌డ్రా చేశారని అధికారి తెలిపారు. అరెస్టయిన ముఠా సభ్యులను సార్థక్ చౌదరి, సబియుద్దీన్, అజీమ్, శశాంక్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 1.04 లక్షల రూపాయలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హమ్ హై రహీ ప్యార్ కే , వెల్‌కమ్ చిత్రాలలో తన నటనతో పాపులరైన ముస్తాక్ ఖాన్ వద్ద నుంచి భారీగా డబ్బు గుంజేందుకు కిడ్నాపర్లు ఈ పథకం వేసారు.
అంతేకాదు ఇలాంటి ఈవెంట్‌కు హాజరయ్యేందుకు నటుడు శక్తి కపూర్‌కు రూ.5 లక్షలు ఆఫర్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే అధిక అడ్వాన్స్ రిక్వెస్ట్ కారణంగా డీల్ ఆగిపోయింది. అంతేకాదు.. ఇంకా ఎవరైనా సినీ తారలను కిడ్నాప్ చేసే ప్లాన్ ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. లవీ సహా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సునీల్ పాల్ కేసులో పురోగతి:
ఈ కేసు ఇలా ఉండగా మరో హాస్యనటుడు సునీల్ పాల్ అపహరణలో పాల్గొన్న కిడ్నాపర్లలో ఒకరైన అర్జున్ ఆదివారం మీరట్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డాడు. అటుపై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని లాల్‌కుర్తి పోలీస్ స్టేషన్‌లో మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా సబ్ ఇన్‌స్పెక్టర్ పిస్టల్ లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడని మీరట్ పోలీసులు తెలిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన అర్జున్ పోలీసు బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పోలీసు బృందం ప్రతీకారం తీర్చుకుంది. ఎదురుకాల్పుల్లో అర్జున్ కి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు.
ఖాన్ కిడ్నాప్ తో పాటు నటుడు సునీల్ పాల్ కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గత నెలలో సునీల్ పాల్ కిడ్నాప్‌కు ఉపయోగించిన ఎస్‌యూవీ, స్కార్పియో అలాగే నేరానికి ఉపయోగించిన రూ. 2.25 లక్షల నగదు, మొబైల్ ఫోన్ సహా అర్జున్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మీరట్ పోలీస్ అధికారులు తెలిపారు. గాయపడిన స్థితిలో అర్జున్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్‌కు పాల్పడిన ముఠా బిజ్నోర్‌లో ఉన్నట్లు భావిస్తున్నందున పోలీసులు ఇప్పుడు అతడి సహచరుల కోసం వెతుకుతున్నారు.