దేశం కాని దేశంలో ప్రముఖ హీరోయిన్ మిస్సింగ్
దేశం కాని దేశంలో మిలిటెంట్లతో యుద్ధం జరుగుతున్న వేళ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అదే చోట మిస్సవ్వడం కలకలం రేపింది.
దేశం కాని దేశంలో మిలిటెంట్లతో యుద్ధం జరుగుతున్న వేళ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అదే చోట మిస్సవ్వడం కలకలం రేపింది. మిస్సయిన హీరోయిన్ జాడను ఇంకా కనుగొనలేదు. ప్రస్తుతానికి అంతా సస్సెన్స్ గా మారింది. ఓవైపు మిలిటెంట్లు అక్కడ రాకెట్ లాంచర్లతో దాడులు ఆపడం లేదు. వందలాదిగా ప్రజలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. అలాంటి ప్రమాదకర స్థలంలో హీరోయిన్ చిక్కుకుంది. ఇంతకీ సదరు హీరోయిన్ సేఫ్ గా ఉన్నట్టా లేనట్టా? ఇంకేదైనా ఊహించనిది జరిగిందా? అంటే.. ఇప్పటికి ఎలాంటి స్పష్ఠతా లేదు.
ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా ఆ దేశంలో ఇరుక్కుపోయారు. హమాస్ (మిలిటెంట్ సంస్థ) వివిధ ప్రదేశాల నుండి పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించినప్పుడు అదే చోట హీరోయిన్ నుస్రత్ ఇరుక్కుపోయింది. ఇజ్రాయేల్- పాలస్తీనా మధ్య వివాదం ప్రారంభం కాగా.. వరుస దాడులతో ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇబ్బందికర స్థితిలో ఉంది. అయితే అప్పటికే ఇజ్రేయేల్ లో ఉన్న నుష్రత్ జాడ కనిపించలేదు. చిత్ర బృందం తనను ఫోన్ లైన్ లో కానీ మరే ఇతర మార్గాల్లో కానీ సంప్రదించలేకపోయింది. తన జాడను ట్రేస్ చేయలేకపోయిందని ప్రముఖ జాతీయ మీడియా `ఇండియా టీవీ` కథనం వెలువరించింది.
ఇండియా టీవీ జర్నలిస్ట్ కథనం ప్రకారం... నుస్రత్ ఆమె బృందం మధ్య జరిగిన చివరి సంభాషణ ప్రకారం.. తాను మధ్యాహ్న సమయానికి ఇతర ప్రజలతో కలిసి నేలమాళిగ(అండర్ గ్రౌండ్ టన్నెల్)లో ఉన్నానని నుష్రత్ చెప్పింది. అప్పటి నుంచి కాంటాక్ట్ తెగిపోయింది. ఓవైపు అక్కడ యుద్ధం కొనసాగుతోంది. రాకెట్ లాంచర్లు విరుచుకుపడుతున్నాయి. దీంతో అందరిలో ఆందోళన.
ఈ క్రైసిస్ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆదివారం తెల్లవారుజామున 300 మందికి పైగా ఇజ్రాయెలీ ప్రజలను హమాస్ చంపినందుకు తన రక్షణ దళాలను యుద్ధానికి సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు. జరిగిన ఘోరానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చర్యల్ని చేపడుతుండడంతో ప్రజలంతా పారిపోవాలని గాజా నివాసితులను ఇజ్రాయేలీ ఆర్మీ కోరింది. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయేల్ ప్రధానమంత్రి సందేశం సంచలనమైంది. డజన్ల కొద్దీ పాలస్తీనా హమాస్ మిలిటెంట్లతో గాజా అప్పటికే దిగ్భంధనం అయింది. సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణాల్లోకి ప్రవేశించి ప్రజలను చంపారు. అయితే ఇజ్రాయేలీ ప్రతిఘటనతో కొందరు మిలిటెంట్లు మరణించారు. వారు ప్రజల్ని చంపారు. కొందరిని అపహరించారు. శనివారం ప్రధాన యూదు సెలవుదినం కావడంతో ప్రజలు ఇండ్లలోనే ఉన్నారని కూడా తెలిసింది.
ఇకపోతే భారతీయ కథానాయిక నుస్రత్ మిస్సింగ్ గురించి అభిమానుల్లో ఆమె కుటుంబీకుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. 38 ఏళ్ల నుస్రత్.. ప్రణయ్ మేష్రామ్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా `అకెల్లి`లో చివరిగా కనిపించింది. ఈ చిత్రంలో ఒక సాధారణ భారతీయ అమ్మాయి పాత్రను పోషించింది. ఆసక్తికరంగా ఈ సినిమా కథాంశం కూడా నేటి ట్రామాటిక్ సిట్యుయేషన్ కి దగ్గరగా ఉంది. కథానాయిక వార్ జోన్ లో ఇరుక్కుని సురక్షితంగా బయటకు రావడానికి కష్టపడుతుంది. అలాగే `చోరి` సీక్వెల్ అయిన చోరీ 2 లోను నుస్రత్ నటించింది. ఇది హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుంది.