విశాల్ దెబ్బకి బాలీవుడ్ స్తంభించిందా!
దీంతో సమాచార శాఖ హుటాహుటిన రంగంలోకి దిగి తప్పు ఎక్కడ జరిగిందో? ఎవరిదో తెలసుకునే దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది
విశాల్ పంచ్ కి బాలీవుడ్ స్థంభించిందా? సెన్సార్ బోర్డ్ పై విశాల్ ఆరోపణలతో సభ్యుల్లో అయోమయం నెలకొందా? నేరుగా ప్రభుత్వ పెద్దలే స్పందించడంతో సన్నివేశం రసవత్తరంగా మారిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ముంబై సెన్సార్ బోర్డ్ పై విశాల్ తన వద్ద నుంచి 6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే.
దీంతో సమాచార శాఖ హుటాహుటిన రంగంలోకి దిగి తప్పు ఎక్కడ జరిగిందో? ఎవరిదో తెలసుకునే దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీ కూడా వేసింది. తప్పు జరిగితే కఠినంగా శిక్షిస్తామని...ప్రభుత్వ కార్యాలయంపైనే ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తాజాగా ఈ వివాదంపై సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
విశాల్ ఆరోపణలపైనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి. మంగళవారం సెన్సార్ బోర్డ్ సభ్యులందరితో ప్రసూన్ జోషీ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ముంబై సెన్సార్ సభ్యులంతా ఈ వివాదంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని..ముఖ్యమంత్రి దృష్టికి సైతం ఈ వివాదం చేరడంతో అధికారులు అవిశ్రామంగా శ్రమించాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రభావం హిందీ సినిమాలపై పడిందని వినిపిస్తోంది. సెన్సార్ కోసం వెళ్లిన సినిమాలేవి సెన్సార్ అవ్వడం లేదని...అవి ఎప్పుడు అవుతాయో కూడా సమయం చెప్పలేకపోవడంతో దర్శక-నిర్మాతలు గందరగోళంలో పడుతున్నారుట.
దీంతో తమ సినిమా రిలీజ్ తేదీల్ని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. రిలీజ్ తేదీల్ని ముందుగానే ప్రకటించుకుని...ఎలాగూ సెన్సార్ అయిపోతుంది అన్న ధీమాతో ఉన్న వారంతా ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు సెన్సార్ కోసం వెళ్తోన్న సినిమాలు సంఖ్య కూడా భారీగా ఉందని సమాచారం. ఇప్పుడున్న ముంబై సెన్సార్ కార్యాలయం వీటన్నింటి సెన్సార్ పనులు పూర్తి చేయాలంటే అప్పటికప్పుడు జరిగేది కాదని..ప్రభుత్వం ఇతర బోర్డ్ మెంబర్లని కూడా పిలిచించి సెన్సార్ చేస్తే తప్ప! పూర్తి కావడం కష్టమనే విమర్శ వినిపిస్తోంది.