ఇజ్రాయేల్ వార్‌లో చిక్కుకున్న న‌టి క్షేమ‌మేనా?

హైఫీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌కు వెళ్లిన బాలీవుడ్ క‌థానాయిక‌ నుష్రత్ భారుచా అక్క‌డ అనూహ్యంగా ప్రారంభ‌మైన యుద్ధంలో చిక్కుకుపోయార‌ని క‌థ‌నాలొచ్చాయి.

Update: 2023-10-08 08:27 GMT

హైఫీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌కు వెళ్లిన బాలీవుడ్ క‌థానాయిక‌ నుష్రత్ భారుచా అక్క‌డ అనూహ్యంగా ప్రారంభ‌మైన యుద్ధంలో చిక్కుకుపోయార‌ని క‌థ‌నాలొచ్చాయి. నిన్న మ‌ధ్యాహ్నం త‌న‌తో కాంటాక్ట్ క‌ట్ అయిపోయింద‌ని ఆందోళ‌న చెందారు. కానీ ఇప్పుడు త‌న కుటుంబీకులు, అభిమానుల‌కు శుభ‌వార్త అందింది. యుద్ధ విమానాల దాడుల వేళ నుస్రత్ భ‌రూచా సుర‌క్షితంగానే ఉన్నారు. అండ‌ర్ గ్రౌండ్ లో త‌ల దాచుకున్నారు.

తాజాగా జాతీయ మీడియా వెలువ‌రించిన క‌థ‌నాల ప్ర‌కారం.. నుస్ర‌త్ ఇప్ప‌టికే సురక్షితమైన ఎయిర్‌పోర్ట్ ప్రాంతానికి విజయవంతంగా చేరుకున్నారు. కొన్ని గంట‌ల్లో ఆమె ఇజ్రాయెల్ నుండి విమానం ఎక్కనుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇజ్రాయెల్ వ‌ర్సెస్ పాల‌స్తీనా హమాస్ మధ్య యుద్ధం తీవ్రమైంది. హమాస్ రాత్రిపూట రాకెట్ దాడులు చేసిన‌ తర్వాత, ఇజ్రాయెల్ ప్రతీకారంగా `గాజా`పై దాడి చేయడం ప్రారంభించగా, యోగి శైలిలో హమాస్ లక్ష్యాలపై దాడి చేస్తోందని క‌థ‌నాలొచ్చాయి. ఇజ్రాయెల్ హమాస్ స్థానాలపై బుల్డోజర్లను ఉపయోగించిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం నేప‌థ్యంలో బాలీవుడ్ నుండి బాధ కలిగించే వార్తలు వెలువడ్డాయి. అందాల హీరోయిన్ నుష్రత్ భరుచా ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయినట్లు వెల్లడైంది. నుస్ర‌త్ బృందంలోని సభ్యుడు ఈ సమస్యాత్మక పరిస్థితిని ధృవీకరించారు. స‌ద‌రు వ్య‌క్తి మీడియాకు షేర్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, ``నుష్రత్ భారుచా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు త‌ను అక్కడికి వెళ్లింది. నుస్ర‌త్‌తో చివరిగా శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు టీమ్ సంభాషించింది. ఆ సంభాషణ సమయంలో త‌ను నేలమాళిగలో సురక్షితంగా ఉన్నాన‌ని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా అదనపు వివరాలు రివీల్ చేయ‌లేదని తెలిసింది.

టీమ్ స‌భ్యులు చివరి వ‌ర‌కూ నుస్రత్‌ను చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె సురక్షితంగా భారతదేశానికి తిరిగి రావడానికి బృందం శ్రద్ధగా పని చేస్తోందని తెలిసింది. భార‌త‌దేశం స‌ద‌రు క‌థానాయిక‌ సురక్షితంగా ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావాలని ఆశిస్తోంది.

నుష్రత్ న‌టించిన అకేలి ఆగస్టులో విడుదలైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం క‌థాంశం యాధృచ్చికంగా ఇప్పుడు నుస్ర‌త్ ఎదుర్కొన్న స‌న్నివేశాన్ని స్ఫుర‌ణ‌కు తెస్తుంది. ఇరాక్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఒక అమ్మాయి, తీవ్ర‌ గందరగోళం మధ్య ఇంటికి తిరిగి రావడానికి ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేసింద‌న్న‌దే క‌థాంశం. అనుకోకుండానే ఈ చిత్రం కథాంశం నటి నుస్ర‌త్ జీవితంలో ఒక వాస్తవిక సంఘ‌ట‌న‌గా మారింది.

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శనివారం ఇజ్రాయెల్‌పై విస్తృతమైన దాడిని ప్రారంభించింది. కేవలం 20 నిమిషాల్లో 5000 రాకెట్లతో దాడులు చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. అదనంగా ఇజ్రాయెల్ సైనికులు పౌరులను బందీలుగా తీసుకున్నట్లు హమాస్ పేర్కొంది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఎదురుదాడిలో 198 మంది మరణించారు. సుమారు 1,500 మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులను పెంచిన ఈ దాడికి హమాస్ పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగింద‌ని తెలిసింది.

Tags:    

Similar News