బాలీవుడ్ రామాయణ.. లక్ష్మణ పాత్రలో మన హీరోనే?
బాలీవుడ్ లో మరో రామాయణం ప్రాజెక్టు తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ నితీష్ తివారి ఈసారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు.
బాలీవుడ్ లో మరో రామాయణం ప్రాజెక్టు తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ నితీష్ తివారి ఈసారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' ఘోరపరాజయాన్ని చవిచూడడంతో ఈ సినిమా రిజల్ట్ చూసి దర్శకుడు నితీష్ తివారి తాను తీస్తున్న రామాయణం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆదిపురుష్ మేకర్స్ చేసిన తప్పులు తాను చేయకూడదని రామాయణాన్ని సరిగ్గా ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా నితీష్ తివారి రామాయణ ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అయిన సంగతి తెలుసిందే. ఇక తాజాగా రామాయణంలో మిగతా ప్రధాన పాత్రల్లో నటించబోయే నటీనటుల వివరాలు బయటికి వచ్చాయి. దాని ప్రకారం ఈ ప్రాజెక్టులో భారీ తారాగడమే భాగమవుతుంది.
ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లంకేష్ గా కేజీఎఫ్ హీరో యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీడియోల్, కైకేయిగా లారా దత్తా, విభీషణుడిగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టులో లక్ష్మణుడి క్యారెక్టర్ కోసం మన 'జాతి రత్నాలు' హీరో నవీన్ పోలిశెట్టి ని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. డైరెక్టర్ నితేష్ తివారితో నవీన్ పోలిశెట్టి మంచి బాండింగ్ ఉంది.
ఆయన డైరెక్ట్ చేసిన 'చిచోరే' సినిమాతోనే నవీన్ కెరియర్ మలుపు తిరిగింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు రామాయణంలో లక్ష్మణుడి క్యారెక్టర్ కోసం నితీష్ తివారి నవీన్ పోలిశెట్టిని అనుకుంటున్నారట. ఇదే నిజమైతే ఈ ప్రాజెక్టు నవీన్ కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందిని చెప్పొచ్చు. ఇక ఈ ప్రాజెక్టు మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. 2025 దీపావళి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.