బాలీవుడ్ ఈ ఫార్ములా పక్కన పెట్టాల్సిందే
ఫైటర్ సినిమాలో చూపించిన ఎయిర్ యాక్షన్ విన్యాసాలు బాగానే ఉన్నప్పటికీ కథ మాత్రం పరమ రొటీన్. పాకిస్తాన్ ఉగ్రవాదిని విలన్ గా చూపించడం.
బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హృతిక్ రోషన్, సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన సినిమా.. ఫైటర్. ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఇందులో అదిరిపోయే యాక్షన్ ఘట్టాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో చూడని ఎయిర్ యాక్షన్ విన్యాసాలు ఇందులో చూడొచ్చు. ఇక హృతిక్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ దీపిక పదుకొనే కూడా ఆకట్టుకుంది. సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. అయినా కూడా ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. అసలు విడుదలకు ముందు సినిమాకు బజ్ యే క్రియేట్ కాలేదు. అందుకు ప్రధాన కారణం.. యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు ఈ తరహా యాక్షన్ సినిమాల డోస్ పరిమితికి మించి ఇచ్చేయడమే.
ఫైటర్ సినిమాలో చూపించిన ఎయిర్ యాక్షన్ విన్యాసాలు బాగానే ఉన్నప్పటికీ కథ మాత్రం పరమ రొటీన్. పాకిస్తాన్ ఉగ్రవాదిని విలన్ గా చూపించడం.. ఆ విలన్ పాక్ ఆర్మీ సాయంతో ఇండియా మీద కుట్ర చెయ్యడం.. హీరో వీరోచితంగా పోరాడి ఆ కుట్రను భగ్నం చేయడం.. చాలా ఏళ్ల నుంచి ఇదే ఫార్ములాని పట్టుకుని అరగదీస్తూ వస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ఒకసారి ఇదే ఫార్ములాను అనుసరిస్తోంది. ఆ సంస్థలో సిద్ధార్థ్ చేసిన పఠాన్ కూడా ఇదే లైన్లో సాగే సినిమా. ఆ సినిమా బాగానే ఆడింది కానీ తర్వాత వచ్చిన టైగర్-3 తుస్సుమనిపించింది. అప్పటికే జనాలకు మొహం మొత్తేయగా ఇప్పుడు ఫైటర్ కూడా అలాంటి కథతోనే వచ్చింది. అసలు ఇండియాలో కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులే జరగట్లేదు. అలాంటప్పుడు పదేపదే ఇండియా మీద కుట్ర జరుగుతున్నట్లు పాకిస్తాన్ ను విలన్ గా చూపించి సినిమాలు తీస్తే జనాలకు ఏం ఎక్కుతుంది? కాబట్టి ఇకనైనా ఈ ఫార్ములాను బాలీవుడ్ పక్కన పెట్టేస్తే బెటర్.