ట్రెండీ స్టోరి: సౌత్‌లో బాలీవుడ్ విలన్ల హవా!
వివేక్ ఒబెరాయ్ .. నీల్ నితిన్ .. విద్యుత్ జమ్వాల్ బాలీవుడ్ లో హీరోలుగా నటించి సౌత్ లో విలన్లు అయ్యారు.
ఉత్తరాది పరిశ్రమ నుంచి దక్షిణాదికి విలన్ల రాక వెల్లువలా మారింది. సోనూ సూద్.. రాహుల్ దేవ్.. విద్యుత్ జమ్వాల్.. ఉపేన్ పటేల్.. వివేక్ ఒబెరాయ్.. నీల్ నితిన్ ముఖేష్ వీళ్లంతా సౌత్ లో విలన్లుగా నటించారు. సోనూసూద్ టాలీవుడ్ లో ఫేమస్ విలన్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించారు. రజనీ కాంత్ కు ధీటైన పాత్రలో శంకర్ అతడిని చూపించారు.
వివేక్ ఒబెరాయ్ .. నీల్ నితిన్ .. విద్యుత్ జమ్వాల్ బాలీవుడ్ లో హీరోలుగా నటించి సౌత్ లో విలన్లు అయ్యారు. బ్లాక్ బస్టర్ జిందగి న మిలేగి దొబారా చిత్రంలో నటించిన అభయ్ దశాబ్ధ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం లవ్ ఆఫ్ డిసెంట్.. బౌంటీ హంటర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన కూడా సౌత్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ తమిళ చిత్రం `హీరో`లో విలన్ గా అభయ్ డియోల్ నటించాడు. మరో ట్యాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సైతం తమిళంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.
సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, డినో మోరియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబి డియోల్ ఇలా వరుసగా సౌత్ లో విలన్లుగా సత్తా చాటుతున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లో నవాజుద్దీన్ నటన చూసి మురిసిపోయిన విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో అవకాశం కల్పించారు. నవాజ్ నటనకు మంచి పేరొచ్చింది. సంచలనాల కేజీఎఫ్ 2లో అధీరా పాత్రలో సంజయ్ దత్ నటన అసమానం. సంజూభాయ్ విలన్ గా సౌత్ ఆడియెన్ ని మెప్పించారు. అతడు ప్రస్తుతం సౌత్ లో పెద్ద స్థాయి సినిమాల్లో విలన్ గా నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇంతకుముందు నందమూరి బాలకృష్ణ నటించిన `భగవంత్ కేసరి` చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. బాలయ్యతో పోటీపడుతూ అతడు నటించిన విధానం అభిమానులకు కనెక్టయింది. రాంపాల్ ఇక్కడ అందరికీ అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు. అక్కినేని అఖిల్ ఏజెంట్ చిత్రంలో డినో మోరియో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెప్పించాడు. తెలుగు ఆడియెన్ కి పరిచయం కావడం సంతోషాన్నిచ్చిందని అతడు అన్నాడు. మరిన్ని చిత్రాల్లో నటించేందుకు డినో ఆసక్తిగా ఉన్నాడు.
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సందీప్ వంగా `యానిమల్`లో విలన్ గా నటించాడు బాబి డియోల్. క్రూరుడైన అబ్రార్ పాత్రలో అద్భుతంగా నటించిన బాబికి ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సౌత్ లో పలు భారీ చిత్రాల్లో నటిస్తూ అతడు బిజీగా ఉన్నాడు. యానిమల్ అతడికి సెకండ్ లైఫ్ ని ఇచ్చిందని చెప్పాలి. బాబి తదుపరి బాలకృష్ణ సినిమాలోను విలన్ గా నటిస్తున్నారు.
ఈ వెల్లువ చూస్తుంటే సౌత్ లో విలన్లుగా నటించేందుకు బాలీవుడ్ స్టార్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారని అర్థమవుతోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో సౌత్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమా క్రేజ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడిస్తూనే ఉంది. దానికి అనుగుణంగానే బాలీవుడ్ నుంచి కొత్త ముఖాలు టాలీవుడ్ కి పరిచయం అవుతుండడం ట్రెండ్ గా మారింది.