1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలివే!

భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కుతుంది. కాకపోతే ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలు మాత్రమే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేవి

Update: 2024-07-13 03:55 GMT

భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కుతుంది. కాకపోతే ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలు మాత్రమే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేవి. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నాయి. మన ఫిలిం మేకర్స్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, హలీవుడ్ స్టాండర్డ్స్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు రూపొందిస్తున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD', మళ్ళీ అందరూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. లేటెస్టుగా మైలురాయి ₹1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ నేపథ్యంలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. 'బాహుబలి-2' (2017):

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఎపిక్ యాక్షన్ మూవీ "బాహుబలి 2: ది కన్‌క్లూజన్". ఇది 'బాహుబలి: ది బిగినింగ్' కు రెండో భాగం. దీన్ని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది. ఇది వరల్డ్ వైడ్ గా ₹1810.60 కోట్ల కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. డొమెస్టిక్ మార్కెట్ లోనే ₹1,429.83 కోట్లు వసూళ్లు సాధించి, ఇండియాలో అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. అంతేకాదు 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి భారతీయ సినిమాగా, మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది.

2. 'దంగల్‌' (2016):

అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కించిన హిందీ సినిమా ''దంగల్''. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. ప్రపంచ వ్యాప్తంగా ₹2024 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 2017లో చైనా రిలీజ్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకెక్కింది. అలానే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రం దేశీయ మార్కెట్ (₹565 కోట్లు) లో కంటే ఓవర్ సీస్ (₹1459 కోట్లు) లో ఎక్కువ వసూలు చేయడం గమనార్హం.

3. RRR (2022):

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా "ఆర్ఆర్ఆర్". డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ₹1387.26 కోట్లు కొల్లగొట్టింది. ఇండియాలో ₹944 కోట్లు, ఓవర్సీస్ లో ₹443.26 కోట్లు వసూలు చేసింది. ఇది వెయ్యి కోట్ల క్లబ్ లో చేసిన రెండో తెలుగు మూవీ. ఓటీటీలోకి వచ్చిన గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. 'నాటు నాటు' పాటతో అకాడమీ అవార్డ్ గెలుచుకుంది. వందేళ్ల ఇండియన్ సినిమా ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టింది.

4. 'KGF 2' (2022):

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ కథానాయకుడిగా నటించిన కన్నడ మూవీ ''కేజీయఫ్‌ చాప్టర్ 2''. ఇది 'కేజీయఫ్‌ చాప్టర్ 1' కు సెకండ్ పార్ట్. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ₹1250 కోట్లు కలెక్షన్లు సాధించింది. దేశీయ మార్కెట్ లో రాబట్టిన వసూళ్లతోనే ₹1000 కోట్ల క్లబ్ లో చేరిన రెండో చిత్రంగా రికార్డ్ సృష్టించింది. కాకపోతే ఓవర్ సీస్ లో ఈ సినిమా ₹242 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

5. 'పఠాన్‌' (2023):

షారుక్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ "పఠాన్". యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందిన ఈ హిందీ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా ₹1050 కోట్లు రాబట్టగలిగింది. దీంతో వెయ్యి కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఐదో సినిమాగా నిలిచింది. ఇది ఇండియాలో ₹654.28 కోట్లు.. ఓవర్ సీస్ లో ₹396.02 కోట్లు వసూలు చేసింది.

6. 'జవాన్‌' (2023)

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన హిందీ సినిమా ''జవాన్''. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ₹1148.32 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. గతేడాది అత్యధిక వసూళ్లు అందుకున్న భారతీయ సినిమాగా నిలిచింది. మన దేశంలో ₹761.98 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఓవర్ సీస్ లో ₹386.34 కోట్లు రాబట్టింది.

7. 'కల్కి 2898 AD' (2024):

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ మూవీ "కల్కి 2898 ఏడీ". ఇటీవలే విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ₹1000 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. ఇది వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఏడో భారతీయ చిత్రంగా, మూడో తెలుగు సినిమా నిలిచింది. ఇక నార్త్‌ అమెరికాలో 17 మిలియన్ డాలర్లు వసూలు చేసి నాన్‌-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ.. ఫుల్‌ రన్‌లో ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News