'బబుల్ గమ్' మూవీ రివ్యూ
నటీనటులు: రోషన్ కనకాల- మానస చౌదరి-హర్షవర్ధన్- అను హాసన్- హర్ష చెముడు- అనన్య ఆకుల - కిరణ్ మచ్చ - చైతు జొన్నలగడ్డ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
రచన: రవికాంత్ పేరెపు- విష్ణు కొండూరు- సెరి- గన్ని
నిర్మాణం: మహేశ్వరి మూవీస్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: రవికాంత్ పేరెపు
కథ:
ఆది (రోషన్ కనకాల) హైదరాబాదులో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. అతను ఒక డీజే. ఒక పార్టీలో ఆది మ్యూజిక్ నచ్చి అతనితో స్నేహం చేస్తుంది జాన్వి (మానస చౌదరి). రిచ్ ఫ్యామిలీకి చెందిన జాన్వి యూరప్ లో మాస్టర్స్ చేయడానికి అడ్మిషన్ తీసుకుంటుంది. ఆది ఆమెను సిన్సియర్ గా ప్రేమిస్తాడు. మొదట్లో ఆదితో సరదాగానే స్నేహం చేసిన జాన్వి.. తర్వాత తను కూడా అతడి ప్రేమలో పడుతుంది. తన ప్రేమను ఆదికి చెప్పేలోపే ఇద్దరి మధ్య అపార్థాలు మొదలవుతాయి. దూరం కావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ పరిస్థితులను అధిగమించి ఆది- జాన్వి తిరిగి కలిశారా లేదా అన్నదే మిగతా కథ.
కథనం- విశ్లేషణ:
క్షణం లాంటి పర్ఫెక్ట్ థ్రిల్లర్ తర్వాత దానికి పూర్తి భిన్నంగా కృష్ణ అండ్ హిస్ లీల అనే రొమాంటిక్ లవ్ స్టోరీ తీసి దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు రవికాంత్ పేరెపు. ఈ సినిమాలో రచయితగా కూడా అతని పనితనం కనిపించింది. ఆధునిక ప్రేమ బంధాల మీద ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంటే. కథపరంగా వచ్చే కొన్ని మలుపులకు తోడు.. ప్రధాన పాత్రల మధ్య జరిగే కాన్వర్జేషన్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతాయి. పాత్రలతో, సన్నివేశాలతో ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. బబుల్ గమ్ ట్రైలర్ చూస్తే.. కృష్ణ అండ్ హిస్ లీల తరహాలోనే మోడర్న్ రిలేషన్షిప్స్ మీద ఇది ఇంకో టేక్ లాగా అనిపించింది. రవికాంత్ ప్రయత్నం అయితే అదే కానీ.. ఈసారి కథపరంగా చెప్పుకోదగ్గ మలుపులు ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్లు లేకపోవడంతో బబుల్ గమ్ ప్రేక్షకులకు అనుకున్నంతగా ఆహ్లాదం.. వినోదం పంచ లేకపోయింది.
ప్రేమకథల్లో ప్రతిసారి కొత్తదనం ఆశించలేం. చాలావరకు ఈ కథలు ప్రేమ జంట పరిచయం.. వారి మధ్య ప్రేమ.. ఆ తర్వాత సమస్య.. ఎడబాటు.. చివరగా కథ సుఖాంతం లేదా దు:ఖాంతం.. ఇదే లైన్లో నడుస్తుంటాయి. అయితే ప్రేమకథల్లో ట్రీట్మెంట్ బావుంటే, ఫీల్ వర్కవుట్టయితే.. లీడ్ పెయిర్ ఆకట్టుకుంటే.. కథ అటు ఇటుగా ఉన్నా ప్రేక్షకులు మన్నించేస్తారు. బబుల్ గమ్ ఈ విషయాల్లో సోసోగానే అనిపిస్తుంది. సినిమాలో విశేషంగా చెప్పుకోదగ్గది ఇంటర్నల్ దగ్గర వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్. కానీ అది అంత సహజంగా అనిపించదు. కొంచెం క్రేజీగా ఉన్న ఆ పాయింట్ పట్టుకొని.. రెండు గంటలకు పైగా నిడివిలో కథను విపరీతంగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. టైటిల్ కోణంలో చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి తీయగా అనిపించి.. మిగతాదంతా చప్పగా తయారైంది. కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలో మాదిరి ఇందులో పాత్రలు, వాటి మధ్య కాన్వర్జేషన్లు ఎంత మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. రిచ్ అమ్మాయి.. మధ్యతరగతి కుర్రాడు.. వీరి మధ్య అనుకోకుండా పరిచయం- ప్రేమ.. ఇద్దరి మధ్య జీవన విధానంలో తేడా.. ఈ వ్యవహారం అంతా కూడా చాలా రొటీన్ గా.. సాధారణంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వచ్చేవరకు కథలో అసలు కదలికే కనిపించదు.
ప్రేమకథలో సమస్య తలెత్తిన సమయంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగిన బబుల్ గమ్.. ఆ తర్వాత మళ్లీ గాడి తప్పుతుంది. ఏదో ఇజ్జత్ ఇజ్జత్ అంటూ ఒక్కసారిగా కసితో ఊగిపోవడం చూసి ఏదో అయిపోతుందని అనుకుంటాం. కానీ అతను జస్ట్ ఒక పాట పాడి ఏదో సాధించేసినట్టు ఫీల్ అయిపోతుంటాడు. హీరోయిన్ చాలా సింపుల్ గా అపార్థం తొలగించేసుకొని హీరోకు తిరిగి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. ఇక వీళ్లిద్దరి రీ యూనియన్ దిశగా సాగే సన్నివేశాలు చికాకు పెడతాయి. క్రమక్రమంగా బబుల్ గమ్ భరించలేని స్థాయికి చేరుతుంది. తెర మీద ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతున్నట్లు ఊరికే.. బ్యాగ్రౌండ్ స్కోర్.. స్లో మోషన్ షాట్ల హడావిడి తప్ప.. సినిమాలో ఏ మూమెంట్ ఉండదు. హీరో హీరోయిన్లిద్దరి పాత్రల చిత్రణ చిత్ర విచిత్రంగా ఉండి ప్రేక్షకులు అయోమయంలో పడతారు. అసలు క్లైమాక్స్ లో దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడో అర్థం కాదు. ప్రేక్షకులను ఒక కన్ఫ్యూజన్లో ఉంచి సినిమా ముగుస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం.. కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ వరకు ఓకే అనిపించినా అంతకుమించి బబుల్ గమ్ లో విశేషంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
నటీనటులు:
మనకు అలవాటైన హీరో లుక్స్ లేకపోవడం వల్ల రోషన్ కనకాలకు అలవాటు పడడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ సినిమా ముందుకు సాగే కొద్దీ అతను నచ్చుతాడు. మన చుట్టూ ఉండే కుర్రాళ్ళలో ఒకడిలా కనిపిస్తాడు అతను. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. తొలి సినిమా అయినా తడబాటు లేకుండా నటించాడు. హీరోయిన్ మానస క్యూట్ అనిపిస్తుంది. అందంతో ఆకట్టుకున్న మానస.. నటన పరంగా ఓకే అనిపించింది. హర్షవర్ధన్, అను హాసన్ పరిణతితో కూడిన పాత్రల్లో చక్కగా నటించారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో చేసిన నటీనటులు కూడా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
శ్రీ చరణ్ పాకాల సంగీతంలో వాయిద్యాల హోరు బాగా ఎక్కువైంది. పాటలు, నేపథ్య సంగీతం గోల గోలగా అనిపిస్థాయి. పాటలు సోసోగా సాగిపోయాయి. ఏమీ లేని చోట బ్యాగ్రౌండ్ స్కోర్ తో హడావిడి చేస్తున్నట్లు అనిపిస్తుంది. సురేష్ రగుతు కెమెరా పనితనం బావుంది. రవికాంత్ తో పాటు పెద్ద టీమ్ కలిసి తయారు చేసిన స్క్రిప్ట్ లో ఏ విశేషం కనిపించదు. కథ పరంగా ఎగ్జైట్ చేసే విషయాలు సినిమాలో లేవు. దర్శకుడిగా తొలి రెండు సినిమాల్లో మాదిరి రవికాంత్ బలమైన ముద్ర వేయలేకపోయాడు. రైటింగ్ దగ్గరే బలహీన పడ్డ బబుల్ గమ్ ను.. తన టేకింగ్ తోనూ మెరుగుపరచలేక పోయాడు.
చివరగా: బబుల్ గమ్.. తీపి తక్కువ- సాగుడెక్కువ
రేటింగ్: 2.25/5