'కెప్టెన్ మిల్లర్' మూవీ రివ్యూ
ఎగ్జైటింగ్ ట్రైలర్ తో ఆకర్షించిన ఈ చిత్రం.. సినిమాగా ఏమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.
'కెప్టెన్ మిల్లర్' మూవీ రివ్యూ
నటీనటులు: ధనుష్-ప్రియాంక అరుల్ మోహన్-శివరాజ్ కుమార్-సందీప్ కిషన్-జయప్రకాష్-అదితి బాలన్-జాన్ కొక్కెన్-నివేదిత సతీష్-ఎలంగో కుమారవేల్ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: సిద్దార్థ నుని
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్-అర్జున్ త్యాగరాజన్
రచన-దర్శకత్వం: అరుణ్ మాదేశ్వరన్
గత దశాబ్ద కాలంలో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ కథానాయకుల్లో ధనుష్ ఒకడు. గత ఏడాది స్ట్రెయిట్ తెలుగు మూవీ 'సార్'తో మన ప్రేక్షకులకు అతను మరింత చేరువ అయ్యాడు. ఇప్పుడు అతడి కొత్త చిత్రం 'కెప్టెన్ మిల్లర్' తెలుగులోకి అనువాదమైంది. ఎగ్జైటింగ్ ట్రైలర్ తో ఆకర్షించిన ఈ చిత్రం.. సినిమాగా ఏమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.
కథ:
భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పూర్వం ఒక పల్లెటూరిలో పేద కుటుంబానికి చెందిన కుర్రాడు అగ్ని (ధనుష్). ఆ ఊరి జనాలు ఎంతో అక్కడ కొలువైన గుడిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ తక్కువ కులం అన్న కారణంతో ఆ ఊరి జనాలను గుడిలోనికి రానివ్వకుండా ఆధిపత్యం చలాయిస్తుంటారు రాజ కుటుంబానికి చెందిన వారసులు. తమ పూర్వీకులు ఇచ్చిన భూముల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్న ఊరి జనాలను ఎలాగైనా అక్కడ్నుంచి తరిమియేలాని వాళ్లు చూస్తుంటారు. ఆ రాజ కుటుంబం అకృత్యాలు చూడలేక సైన్యంలో చేరిపోతాడు అగ్ని. అక్కడ కెప్టెన్ మిల్లర్ గా మారిన అతను.. అనూహ్య పరిస్థితుల మధ్య బ్రిటిష్ వాళ్లపై ఎదురు తిరుగుతాడు. దీంతో అతను పుట్టి పెరిగిన ఊరి మీద బ్రిటిష్ వాళ్ల కన్ను పడుతుంది. ఈ స్థితిలో మిల్లర్ ఏం చేశాడు? రాజ కుటుంబీకులు-బ్రిటిష్ వాళ్ల మధ్య నలిగిపోతున్న ఊరిని ఎలా కాపాడాడు? అన్న ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
మామూలు పాత్రలు ఇస్తేనే చెలరేగిపోతాడు ధనుష్.. అలాంటిది స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారి అరాచకాలు మీద.. అంటరానితనం మీద పోరాడే యోధుడి పాత్ర ఇస్తే అతను చెలరేగిపోకుండా ఉంటాడా? ధనుష్ నటనకు తోడు అదిరిపోయే హీరో ఎలివేషన్లకు లోటు లేదు. యాక్షన్ ఘట్టాలేమో పేలిపోయాయి. వావ్ అనకుండా ఉండలేం. పీరియడ్ సినిమాలనగానే విజువల్ అప్పీల్ ఉంటుంది. ఇందులో విజువల్స్ ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తాయి. అన్నింటికీ మించి మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే దాన్ని తన నేపథ్య సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లే జి.వి.ప్రకాష్ కుమార్.. నేపథ్య సంగీతంతో తాండవమే చేశాడు. ఇవన్నీ చాలవన్నట్లు శివరాజ్ కుమార్.. సందీప్ కిషన్ క్యామియో అట్రాక్షనూ ఉంది. ఇలా 'కెప్టెన్ మిల్లర్'లో హైలైట్లుగా చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్న ప్రేక్షకులు రిలేట్ చేసుకునే కథ.. వాళ్లను కుదురుగా కూర్చోబెట్టే బిగి ఉన్న కథనం ఇందులో మిస్సయ్యాయి. ఆకర్షణలకు లోటు లేకపోయినా.. ఏదో మిస్సయిందన్న ఫీలింగ్ సినిమా అంతటా వెంటాడుతూనే ఉంటుంది.
విడివిడిగా సన్నివేశాలు.. ఎపిసోడ్లు చూస్తే సూపర్ అనిపించి.. మొత్తంగా చూస్తే ఏదో వెలితిలా అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. 'కెప్టెన్ మిల్లర్' ఆ కోవకు చెందిన సినిమానే. విజువల్ గా టాప్ నాచ్ అనిపించే సినిమాలో కథ మాత్రం అంత సహజంగా.. ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా లేకపోయింది. కథ నేపథ్యం.. ప్లాట్ పాయింట్ బాగున్నప్పటికీ.. దాన్ని విస్తరించే క్రమంలో గాడి తప్పేసింది. ఒక ఊరి గుడిలో ఒక విలువైన దేవుడి ప్రతిమ.. దాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని గుడి మీద అజమాయిషీ చలాయించే రాజకుటుంబీకులు.. మరోవైపు దేశాన్ని చెరబట్టి ఆ ఊరినీ కబళించాలని చూస్తున్న బ్రిటిష్ సైన్యం.. వీరి మధ్య నలిగిపోయే ఊరు.. అందులో హీరో.. ఇలా కథ పరంగా సెటప్ అయితే చాలా బాగా చేసుకున్నాడు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. కానీ ఈ కథను నేర్పుగా చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడు. అసలు ఇందులో హీరో పాత్ర చిత్రణే గందరగోళంగా అనిపిస్తుంది. ఒకసారి సియోల్ వెళ్లాలంటాడు. ఇంకోసారి ప్రేమ అంటాడు. మరోసారి బ్రిటిష్ సైన్యంలో చేరతానంటాడు. చివరికి నక్సలైట్ అవుతాడు. మొదటి రెండు లక్ష్యాల్లో స్పష్టత ఉండదు. హీరోయిన్ని ఇలా చూస్తాడు. అలా ప్రేమిస్తాడు. ఆమె కోసం ప్రాణాలు పణంగా పెడతాడు. ఈ ట్రాక్ ను దర్శకుడు గందరగోళంగా నడిపించాడు. రాజ కుటుంబం-గుడి-ఊరు.. ఈ మూడింటి మధ్య కనెక్షన్ ను కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏ ఎపిసోడ్ వివరంగా అనిపించకుండా.. ఒకదాన్నుంచి ఒకదానికి జంప్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరీ నెమ్మదిగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.
'కెప్టెన్ మిల్లర్'లో ప్రేక్షకులు కదిలిపోయేలా చేసేది.. తొలిసారి కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసేది.. బ్రిటిష్ సైన్యంలో భాగమైన హీరో అండ్ కో.. స్వతంత్ర ఉద్యమంలో ఉన్న మన జనాల మీదే కాల్పులు జరిపే ఎపిసోడ్. భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను కదిలిస్తుంది. కథ మలుపు తిరిగేది కూడా ఇక్కడే. హీరో పాత్ర కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ ఫామ్ అవుతుంది. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా తర్వాత ఒకదాని వెంట ఒకటి యాక్షన్ ఎపిసోడ్లు వస్తుంటాయి. ఇంటర్వెల్ ముంగిట విలువైన దేవుడి ప్రతిమను కొల్లగొట్టే ఎపిసోడ్ అదిరిపోతుంది. ఐతే మళ్లీ హీరో పాత్ర ఉద్దేశమేంటో అర్థం కాని గందరగోళం.. ఊరితో అతడి కనెక్షన్ విషయంలో అయోమయం కథను పక్కదారి పట్టిస్తాయి. ద్వితీయార్ధం అంతా యాక్షన్ ప్రధానంగానే సాగుతుంది. చివర్లో ఎమోషన్ బాగానే వర్కవుటైంది. యాక్షన్ ఘట్టాలు వేరే లెవెల్ అనిపిస్తాయి. ఊరి మీదికి భారీ దళంతో వచ్చే బ్రిటిష్ సైన్యం మీదికి హీరో తన బృందం చేసే ఎదురుదాడి హైలైట్. సినిమా చివరికి వచ్చేసరికి కథలో కనిపించే బిగి.. క్లైమాక్సులో ఉన్న ఎమోషన్ మొదట్నుంచి వర్కవుట్ అయి ఉంటే 'కెప్టెన్ మిల్లర్' మంచి స్థాయిలో ఉండేది. దర్శకుడు కథను వివరంగా.. ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేయకుండా.. ఏవేవో పేర్లు పెట్టి చాప్టర్స్ రన్ చేశాడు. దాని వల్ల కథ గందరగోళంగా.. అనాసక్తికరంగా తయారైంది. అతడి నరేషన్లో వేగం లేకపోవడం కూడా మరో మైనస్. ధనుష్ పెర్ఫామెన్స్.. యాక్షన్ ఘట్టాలు.. విజువల్స్- బ్యాంగ్రౌండ్ స్కోర్ సహా సాంకేతిక ఆకర్షణల కోసం 'కెప్టెన్ మిల్లర్'పై ఓ లుక్కేయొచ్చు. కానీ ట్రైలర్ చూసి ఇదేదో ఎపిక్ మూవీ అనుకుంటే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
ధనుష్ నటన గురించి చెప్పేదేముంది? అతి సామాన్యమైన కుర్రాడి క్యారెక్టర్లే కాదు.. మిల్లర్ లాంటి అసామాన్య పాత్రలు చేయడంలోనూ తనకు తానే సాటి అని అతను రుజువు చేశాడు. రకరకాల లుక్స్.. షేడ్స్ లో కనిపించే పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు. తన మేకోవర్ ఆశ్చర్యం కలిగిస్తుంది. పెర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. నక్సలైట్ గా మారాక ధనుష్ నటన అత్యుత్తమంగా సాగింది. ప్రియాంక అరుల్ మోహన్ కు సూటయ్యే పాత్ర ఇచ్చారు ఇందులో. తన నటన ఆకట్టుకుంటుంది. కుమారవేల్ ముఖ్యమైన పాత్రలో రాణించాడు. క్యామియో రోల్స్ లో శివరాజ్ కుమార్.. సందీప్ కిషన్ ఇంపాక్ట్ చూపించారు. జయప్రకాష్.. జాన్ కొక్కెన్ కూడా మెప్పించారు. మిగతా నటీనటులందరూ బాగా చేశారు.
సాంకేతిక వర్గం:
తెర మీద ఈ సినిమాకు ధనుష్ హీరో అయితే.. తెర వెనుక జి.వి.ప్రకాష్ హీరో. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేని 'కెప్టెన్ మిల్లర్'లో నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు జి.వి. ఓ మోస్తరుగా అనిపించే సన్నివేశాలను కూడా అతను తన స్కోర్ తో పైకి లేపాడు. యాక్షన్ ఘట్టాల్లో అయితే ఆర్ఆర్ వావ్ అనిపిస్తుంది. సిద్దార్థ నుని ఛాయాగ్రహణం చాలా బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ట్ విభాగం కష్టం తెరపై కనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్.. స్క్రిప్టు-టేకింగ్ విషయంలో చాలా కష్టపడ్డ విషయం అర్థమవుతుంది. కథా నేపథ్యం సహా కొన్ని విషయాల్లో అతను స్కోర్ చేసినప్పటికీ.. క్లారిటీగా స్టోరీ చెప్పలేకపోయాడు. స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళంగా తయారైంది. తన టేకింగ్ మాత్రం బాగుంది. ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే ఔట్ పుట్ మరింత బాగుండేదమో.
చివరగా: కెప్టెన్ మిల్లర్.. కంటెంట్ ఉంది కానీ
రేటింగ్- 2.5/5