ఆస్కార్‌ అధికారిక ఎంట్రీ మూవీ ఇండియాలో రిలీజ్ డౌటే..భార‌త‌దేశంలో నిషేధం?

సెన్సార్ ముందు చిక్కుల‌ను ఆయ‌న ప్ర‌స్థావించారు. ఇప్పుడు అదే జాబితాలో చేరారు ఫిలింమేక‌ర్ సంధ్యా సూరి.;

Update: 2025-03-27 03:28 GMT
CBFC movie to sensitive content

సీబీఎఫ్‌సి స‌ర్టిఫికేష‌న్ లేనిదే భార‌త‌దేశంలో సినిమాని విడుద‌ల చేయ‌డం కుద‌ర‌దు. ఇది చాలామంది ఫిలింమేక‌ర్స్ కి చిక్కులు తెచ్చిపెడుతోంది. త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను సెన్సార్ అధికారులు అడ్డుకుంటున్నార‌ని, అన‌వ‌స‌ర క‌ట్స్ చెబుతూ సినిమా 'ఆత్మ‌'ను దెబ్బ తీస్తున్నార‌ని చాలామంది ఇదివ‌ర‌కూ విమ‌ర్శించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఓ విదేశీ చిత్రంలోని క్రియేటివ్ ఫ్రీడ‌మ్ ని విశ్లేషిస్తూ, ఇలాంటివి మ‌న దేశంలో ఎందుకు చిత్రీక‌రించ‌లేమో వెల్ల‌డించారు. సెన్సార్ ముందు చిక్కుల‌ను ఆయ‌న ప్ర‌స్థావించారు. ఇప్పుడు అదే జాబితాలో చేరారు ఫిలింమేక‌ర్ సంధ్యా సూరి.

ష‌హానా గోస్వామి ప్ర‌ధాన పాత్ర‌లో సంధ్య సూరి దర్శకత్వం వహించిన `సంతోష్` మూవీ విడుదలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) అడ్డుకుంది. ఆస్కార్‌కు యూకే అధికారిక ఎంట్రీగా నిలిచిన ఈ చిత్రం షార్ట్‌లిస్ట్ దశకు చేరుకుంది. అయితే విడుదలకు ముందు ఈ చిత్రంలో చాలా మార్పులు చేయాలని సీబీఎఫ్‌సి కోరింది. ఇందులో చాలా కోత‌లు కోయాల్సి ఉంది. ముఖ్యంగా పోలీసుల ప్రవర్తన- క్రూర‌త్వం, కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక సమస్యలను ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని విమర్శ‌నాత్మ‌కంగా తెర‌కెక్కింది. కానీ పోలీసుల నైతిక‌త‌ను ప్ర‌శ్నిస్తూ, వారిని క్రూరంగా చూపించార‌ని సీబీఎఫ్ సి క‌ట్స్ విధిస్తోంది. కానీ దీనికి చిత్ర‌ద‌ర్శ‌కనిర్మాత‌లు అంగీక‌రించ‌డం లేదు. ఆత్మ‌ను సినిమా నుంచి తీసేయాల‌ని కోరుతున్నార‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వాదిస్తున్నారు.

సీబీఎఫ్ సి ప్ర‌కారం సీన్ల‌ను ఎడిట్ చేయాల్సి వ‌స్తే, అది పూర్తిగా సినిమాను దెబ్బ తీయ‌డ‌మేన‌ని వారు వాదిస్తున్నారు. సెన్సార్ సూచ‌న‌ల ప్ర‌కారం ఎడిట్ చేస్తే, సినిమాలో చాలా మారిపోతుంద‌ని, ఇది స‌రి కాద‌ని కూడా చెబుతున్నారు. ఈ చిత్రం భారతదేశంలో థియేటర్లలో విడుదల కాకపోవచ్చని కూడా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. స్క్రిప్ట్ స్థాయిలో సెన్సార్ ఆమోదం పొందిన ఒక చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేయడానికి సరైనదిగా పరిగణించడానికి చాలా కోతలు , మార్పులు అవసరం కావడం విచారకరం అని న‌టి ష‌హానా గోస్వామి ఆవేద‌న వ్య‌క్తం చేసారు. `సంతోష్` చిత్ర రచయిత్రి , దర్శకురాలు సంధ్య సూరి `ది గార్డియన్‌`తో మాట్లాడుతూ సెన్సార్ అధికారుల నిర్ణయం నిరాశపరిచేదిగా ఉంద‌ని, హృదయాన్ని క‌ల‌చివేసిందని అన్నారు.

సీబీఎఫ్‌సి నిర్ణ‌యం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ త‌ర‌హా సమస్యలు భారతీయ సినిమాకు కొత్తవి కాదు. ఇంత‌కుముందు వేరే సినిమాల్లో చూపించ‌నివి కావు! అని ద‌ర్శ‌కురాలు అన్నారు. సీబీఎఫ్‌సి సూచించిన మార్పులను అమలు చేయడం `అసాధ్యం` అని పేర్కొన్నారు. కోతల జాబితా చాలా పేజీల పొడవు ఉందని, పోలీసు ప్రవర్తన , విస్తృత సామాజిక సమస్యలకు సంబంధించిన సీన్ల‌ను తొల‌గించాల‌ని సెన్సార్ బోర్డ్ కోరుతోంద‌ని ద‌ర్శ‌కురాలు సంధ్య సూరి అన్నారు. ఈ సినిమా భారతదేశంలో విడుదల కావడం నాకు చాలా ముఖ్యం కాబట్టి దానిని విజయవంతం చేయడానికి ఏదైనా మార్గం ఉందా? అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. కానీ చివరికి సెన్సార్ సూచించిన క‌ట్‌ల‌తో అర్థ‌వంత‌మైన సినిమాని నేను ప్రేక్ష‌కుల‌కు అందించ‌లేనని భావిస్తున్నాను! అని అన్నారు. సీబీఎఫ్‌సి కోరిన మార్పులు చేస్తే సినిమా అర్థం లేదా థీమ్ మారిపోతుంద‌ని, ఇది సాధ్యం కాద‌ని కూడా వ్యాఖ్యానించారు.

ద‌ర్శ‌కురాలు సంధ్యా సూరి తన సినిమాను సమర్థించుకున్నారు. ఇది పోలీసులను త‌ప్పుగా చూపించ‌దు. చాలా సినిమాల్లో చూపించిన‌ట్టు పోలీసుల‌ హింసను కీర్తించదని సంధ్యా సూరి పేర్కొన్నారు. సినిమాలో సంచలనాత్మక విష‌యాల‌ను తాము చూపించ‌లేద‌ని అన్నారు.

Tags:    

Similar News