ప్ర‌పంచ గుర్తింపు: టాప్ 50 భార‌తీయుల్లో చంద్ర‌బోస్-కీర‌వాణి

టాప్ 50లో 33వ స్థానంలో ఏ.ఆర్.రెహ‌మాన్ గౌర‌వం ద‌క్కించుకోగా, 35వ స్థానం కీర‌వాణి-చంద్ర‌బోస్‌ల‌కు ద‌క్కింది.

Update: 2024-08-30 17:35 GMT

వ్యాపారం - కళలలో ప్రపంచవ్యాప్తంగా ప్ర‌భావం చూపిన టాప్ 50 భారతీయుల జాబితాను ప్ర‌ఖ్యాత బిజినెస్ స్టాండార్డ్ ప‌త్రిక ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌చురించింది. ఈ ప్ర‌చుర‌ణ‌లో క‌ళారంగం నుంచి స‌త్య‌జిత్ రే, AR రెహమాన్, తన్వీ షా, ర‌సూల్ పోకుట్టి, గుల్జార్, శంక‌ర మ‌హ‌దేవ‌న్ స‌హా ప‌లువురు దిగ్గ‌జాల పేర్ల‌ను వెల్ల‌డించింది.

ప్రపంచాన్ని కదిలించిన 50 మంది భారతీయుల జాబితాలో టాలీవుడ్ ప్ర‌ముఖులు చంద్ర‌బోస్ - ఎం.ఎం.కీర‌వాణి,  త‌మ స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకున్నారు. టాప్ 50లో 33వ స్థానంలో ఏ.ఆర్.రెహ‌మాన్ గౌర‌వం ద‌క్కించుకోగా, 35వ స్థానం కీర‌వాణి-చంద్ర‌బోస్‌ల‌కు ద‌క్కింది.

1992లో అకాడెమీ అవార్డుల‌లో జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారాన్ని (లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్) అందుకున్న మేటి భార‌తీయ ఫిలింమేక‌ర్ గా స‌త్య‌జిత్ రేకి గొప్ప గుర్తింపు ఉంది. త‌న‌దైన ప్ర‌తిభ‌తో ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు ద‌క్కేలా భార‌తీయ‌ సినిమాకు ఆయ‌న అసాధార‌ణ‌ సేవలు అందించాని బిజినెస్ స్టాండార్డ్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఇక ఇదే జాబితాలో `మొజార్ట్ ఆఫ్ మ‌ద్రాస్`గా సుప్ర‌సిద్ధుడైన ఏ.ఆర్.రెహ‌మాన్ కూడా `స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్` తో సంగీతం విభాగంలో రెండు ఆస్కార్ లు గెలుచుకుని గ్లోబ‌ల్ సినిమాలో స‌త్తా చాటార‌ని వ్యాఖ్యానించింది.

అలాంటి గొప్ప ప్ర‌తిభావంతుల‌కు చోటు ద‌క్కిన జాబితాలో ది గ్రేట్ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి- సీనియ‌ర్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ పేర్లు క‌నిపించ‌డం అభిమానుల్లో గొప్ప‌ ఉత్సాహం నింపుతోంది. తెలుగు సినిమాకి భార‌తీయ సినిమాకి ఆ ఇద్ద‌రూ ఎంతో గౌర‌వం పెంచారు. ఆర్.ఆర్.ఆర్ (2023) `నాటు నాటు..` గీతంతో భార‌తీయ సినిమా ఖ్యాతిని వినువీధిలో విస్త‌రించిన ఘ‌న‌తకు కార‌కులైన బృందంలో వారు ఉన్నారు. `నాటు నాటు..` ఒరిజిన‌ల్ మ్యూజిక్ కేట‌గిరీలో ఆస్కార్ ని గెలుచుకుంది. ఈ పాట‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీప్రియుల‌ను ఉర్రూత‌లూగించింది. ప్ర‌పంచ దేశాల్లో ఎంద‌రో ఈ పాట‌కు క‌నెక్ట‌యి డ్యాన్సులు చేసారు. అలా చేయ‌గ‌లిగిన ఘ‌న‌త కీర‌వాణి- చంద్ర‌బోస్ ప్ర‌భృతుల‌దేన‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

ఇక టాప్ 50 జాబితాలో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు ఉన్నాయి. ముంబైలో జన్మించిన భారతీయ-అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ట్విట‌ర్ CEOగా పనిచేసిన 40 ఏళ్ల అగర్వాల్ పేరు నంబ‌ర్ 1 స్థానంలో నిలిచింది. ట్విటర్‌లో ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఆయ‌న‌ ర్యాంక్‌లతో త్వరగా ఎదిగారు. CEO గా నియామకానికి ముందు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా నియమించబడ్డాడు. అయితే ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం వల్ల అతని పదవీకాలం క్లుప్తంగా మారింది. ఆ త‌ర్వాత జాబితాలో నికేశ్ అరోరా, సైబర్ సెంటినెల్ గ్రూప్ అధినేత, గూగుల్ సుంద‌ర్ పిచాయ్, జాకిర్ హుస్సేన్, ర‌విశంక‌ర్, స‌ల్మాన్ ర‌ష్ధీ, అరుంధ‌తి రాయ్, కిర‌ణ్ దేశాయ్, అర‌వింద్ అడిగా, గునీత్ మోంగా వంటి ప్ర‌ముఖుల పేర్లు టాప్ 50 జాబిత‌లో ఉన్నాయి.

Tags:    

Similar News