వేటూరి సుందరరామమూర్తి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతర్థానం అయినా వారి పాటలు ఎప్పటికీ అభిమానుల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ కలం పదునుతో అంతగా అలరించగలిగే మేటి రచయిత చంద్రబోస్. అద్భుతమైన సాహితీవిలువలతో గేయరచయితగా ఆయన దశాబ్ధాల పాటు కెరీర్ ని విజయవంతంగా సాగిస్తున్నారు. తెలుగు సినిమా పాటకు ఆయువు పోస్తున్న సీనియర్ లిరిసిస్టుగా సమున్నత స్థానాన్ని అలంకరించారు బోస్.
టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలకే కాదు .. గ్రాండియారిటీతో సంబంధం లేకుండా స్థాయీ బేధం లేకుండా పాటలు రాసేందుకు ముందుకొచ్చే గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగేస్తున్న క్రమంలో బోస్ సాహిత్యం మరింత పదునెక్కుతోంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ పాటతో భారతదేశానికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది అంటే చంద్రబోస్ కలం పదును కూడా అందులో ప్రధాన పాత్ర పోషించింది గనుకే. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాటకు లిరిక్ అందించిన చంద్రబోస్ అనంతరం ఆస్కార్స్ అకాడెమీ జూరీ సభ్యుడిగాను ఎంపికై అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఆస్కార్ - గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్ని అందించిన 'నాటు నాటు' రచయితగా 2023లో అరుదైన గుర్తింపు కీర్తిని దక్కించుకున్నాడు చంద్రబోస్. ఇప్పుడు బోస్ కీర్తి కిరీటంలోకి మరో మైలురాయి వచ్చి చేరింది. అతడు 2021లో రిలీజైన 'కొండపొలం' (క్రిష్ దర్శకుడు) చిత్రానికి ఒక అద్భుతమైన పాటను అందించారు. లోతైన ఘాడమైన భావనలతో అద్బుత సాహిత్యంతో రాసిన ఈ పాటకు ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డ్ వరించింది. బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో 'కొండ పొలం' దమ్ ఢాం ఢాం అవార్డును గెలుచుకుంది. యాధృచ్ఛికంగా నాటునాటుకు సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి కొండపొలం చిత్రానికి సంగీతం అందించారు.
ఈ పాటలో.. పచ్చ పచ్చ సెట్టు సేమా - పట్టు సీరలంటా ... నల్లా నల్లా ముల్లకంప నల్ల పూసలంటా.. అంటూ కేవలం రెండే రెండు లైన్ల లిరికి వింటే చాలు.. ఈ పాట తాలూకా డెప్త్ ని అర్థం చేసుకోవచ్చు. ఒక సీనియర్ రచయితగా కలం తిరిగిన యోధుడిగా సింపుల్ పడికట్టు పదాలతో ఎన్నో సార్లు మెస్మరైజ్ చేసారు. ఈసారి కూడా బహుశా జాతీయ అవార్డ్ దక్కడానికి అతడు ఉపయోగించిన పదజాలమే కారణమని భావించవచ్చు. కొండపొలం చిత్రంలో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు.