చంద్రముఖి 2 .. ఆస్కార్ గెలిచినందుకేనా ఈ ప్రాముఖ్యత?
ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ఆస్కార్‌ని తొలిసారి భారతదేశానికి అందించిన ఘనత రాజమౌళి టీమ్ కి దక్కింది.
ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ఆస్కార్‌ని తొలిసారి భారతదేశానికి అందించిన ఘనత రాజమౌళి టీమ్ కి దక్కింది. రాజమౌళి-ఎం.ఎం.కీరవాణి ఇతర టీమ్ సభ్యుల కృషి ఫలితమిది. వారి ప్రతిభ ఎంతో గొప్పది. ఆస్కార్ ని తెలుగు లోగిళ్లలోకి తెచ్చిన `నాటు నాటు..`(ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్) పాటకు కర్తలుగా కీరవాణి-చంద్రబోస్ వంటి వారి కృషి ఎంతో ప్రత్యేకమైనది. నాటు నాటుతో సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. మాస్ బీట్ తో ప్రపంచ ప్రేక్షకుల హృదయలను తాకారు. కారణం ఏదైనా కానీ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తర్వాత కంగన ఇప్పుడు ఎం.ఎం.కీరవాణితో కలిసి పని చేసే అరుదైన అవకాశాన్ని అదృష్టాన్ని దక్కించుకుంది.
పి.వాసు తెరకెక్కిస్తున్న చంద్రముఖి 2లో కంగన టైటిల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చక్కని ప్రశంసలు దక్కాయి. ఇక చంద్రముఖి 2 భారతదేశంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా ఉండబోతోంది. వినాయక చతుర్థి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ ట్రాక్ కొన్ని రోజుల క్రితం విడుదలై ఆకట్టుకుంది. మెలోడియస్ సాంగ్ కి కీరవాణి పనితనం ప్రధాన అస్సెట్ గా నిలుస్తోంది అనడంలో సందేహం లేదు.
ఆసక్తికరంగా MM కీరవాణి ఈ చిత్రానికి పనిచేయడం అరుదైన ఘనతగా టీమ్ భావిస్తున్నట్టే ఉంది. ఇప్పుడు ఆస్కార్ గ్రహీత అయిన కీరవాణి `చంద్రముఖి 2` కోసం ఏకంగా 10 పాటలకు స్వరాలు అందిస్తున్నారు. ఇంతకుముందే కీరవాణి స్వయంగా ఒక ట్వీట్ వేసారు.``చంద్రముఖి 2కి చివరి పని దినం. పి. వాసు సర్.. లైకాతో ఇది ఒక మరపురాని ప్రయాణం. ఒక పాట విడుదలైంది. మిగిలిన 9 పాటలను విడుదల చేయడానికి ఎదురుచూస్తున్నాను!`` అని కీరవాణి వ్యాఖ్యను జోడించారు. కాబట్టి MM కీరవాణి వ్యాఖ్యల్ని బట్టి చంద్రముఖి 2 లో మొత్తం 10 పాటలు ఉంటాయని క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఆహ్లాదకరమైన సంగీతంతో ఉర్రూతలూగించే చిత్రంగా ఉండబోతోందని అర్థమైంది. MM కీరవాణి ఇంతకుముందు `చంద్రముఖి 2` కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని పూర్తి చేసారు. ఇప్పటికే అవుట్‌పుట్‌కు అతడు ప్రశంసలను అందుకున్నాడు. నిజానికి అన్నమయ్య- శ్రీ షిర్డీ సాయి వంటి భక్తిచిత్రాలకు లెక్కకు మిక్కిలి పాటలు అవసరం. కానీ ఇప్పుడు చంద్రముఖి లాంటి హారర్ చిత్రానికి 10 పాటల్ని ఎంపిక చేసుకున్నారు అంటే అది ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ప్రభావం అంటూ గుసగుస వినిపిస్తోంది.
మొత్తానికి ఆస్కార్ గ్రహీత కార్డ్ చంద్రముఖి 2 కి ప్లస్ అవుతుందా లేదా? అన్నది వేచి చూడాలి. పరిశ్రమలో సుదీర్ఘ అనుభవజ్ఞుడైన ఎం.ఎం.కీరవాణి తన సోదరుడు రాజమౌళితో కలిసి ఇటీవలి అన్ని చిత్రాలకు పని చేసారు. బాహుబలి-బాహుబలి2- ఆర్.ఆర్.ఆర్ -ఈగ సహా ఇతర సినిమాలకు అద్భుత సంగీతం అందించారు. అందుకే ఇప్పుడు చంద్రముఖి 2 విషయంలోను కీరవాణి తనదైన మార్క్ చూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు.
P. వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి కి కొనసాగింపు కథతో చంద్రముఖి 2 తెరకెక్కుతోంది. చంద్రముఖి 2000ల ప్రారంభంలో పలు భాషల్లో విడుదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ - జ్యోతిక నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. చంద్రముఖి 2 .. చంద్రముఖి ప్రీక్వెల్ కథతో తెరకెక్కుతోంది. పాన్-ఇండియన్ కేటగిరీలో అత్యంత భారీగా విడుదల కానున్న ఈ చిత్రంలో కంగన రనౌత్- రాఘవ లారెన్స్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, వడివేలు, రాధిక. సురేష్ మీనన్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.