కపూర్ కుటుంబంలా ఎదగాలని కోరుకున్నాను: చిరంజీవి
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. కుటుంబ హీరోలు, వ్యక్తిగత విజయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
``నేను నా విజయాల గురించి మాట్లాడాలంటే.. పవన్ కళ్యాణ్ నా అచీవ్ మెంట్... రామ్ చరణ్ నా అచీవ్ మెంట్. నా కుటుంబంలోని పిల్లలందరూ నా విజయాలు. వీళ్లందరినీ చూస్తుంటే నేను సాధించిన ఘనత ఇదే అనిపిస్తుంది`` అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. APTA (ఆంధ్రప్రదేశ్ తెలుగు అసోసియేషన్) క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాబాస్ భావోద్వేగ ప్రసంగం అహూతులను కదిలించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. కుటుంబ హీరోలు, వ్యక్తిగత విజయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య పవన్ కళ్యాణ్ నన్ను కలిసినప్పుడు నేను ఒకసారి చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. అన్నయ్యా.. మీరు ఏదో చెప్పేవారు గుర్తుందా? మన కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఇది మనతో ఆగకూడదు. మెగా కుటుంబం రాజ్‌కపూర్ కుటుంబంలా మారాలని మీరు చెప్పేవారు.. అని గుర్తు చేసినట్టు తెలిపారు.
కపూర్ కుటుంబంలానే మా కుటుంబం కూడా ఎదగాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నానని .. కపూర్ కుటుంబీకులు సినిమా రంగానికి విశేష కృషి చేశారని మెగాస్టార్ చెప్పారు. కల్యాణ్ చెప్పిన మాటలు విని నాకెంతో ఆనందం కలిగింది. మా మధ్య మాటా మంతీ గురించి తెలియకుండానే ఒక వార్తాపత్రిక యాథృచ్ఛికంగా మమ్మల్ని `దక్షిణాది కపూర్ కుటుంబం` అని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో అది మా గొప్పతనం కాదు... దేవుని మద్దతు అని నేను భావించాను. ప్రజలు, అభిమానులు మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయికి చేర్చారు.. అని చిరు అన్నారు. నిజాయితీగా స్పష్టతతో ఎటువంటి ద్వేషం లేకుండా మాట్లాడటం వలన మీ మాటలు శక్తిని కలిగి ఉంటాయని కళ్యాణ్ తనతో అన్నారని కూడా చిరు ఈ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.