'మెగా 156'.. చురకత్తుల్లాంటి చూపులతో అఫీషియల్!
చిరంజీవి తన 156వ సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్న సంగతి తెలిసిందే
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే పూనకాలు వస్తాయి. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్లు దద్దరిల్లుతాయి. అయితే రీసెంట్గా ఆయన 'భోళాశంకర్'తో భారీ డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇక తన కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడాయన కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్
చిరంజీవి తన 156వ సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రాన్నే అధికారికంగా ప్రకటించారు. 4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి.. అంటూ చిరు గొప్పతన్నాన్ని రాసుకొచ్చారు.
అలాగే ఓ డస్క్రీ కలర్లో ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి తన మీసాలను పదునుగా చేస్తూ చురకత్తులాంటి చూపులతో గంభీరంగా చూస్తూ కనిపించారు. ఇంకా ఈ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన నటించిన గత సినిమాల పేర్లన్నీ కనిపించడం విశేషం. 155 సినిమాల తర్వాత రాబోతున్న ఈ చిత్రం మెగా రాకింగ్‌గా ఉండనుందని తెలిపింది.
అయితే ఈ చిత్ర వివరాలను ఏమీ తెలుపలేదు. ఈ చిత్రానికి బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా బ్రో డ్యాడీ రీమేక్‌గా ఇది రానుంది. మల్టీస్టారర్‌గా రానున్న ఈ చిత్రంలో యంగ్ హీరో శర్వానంద్ నటించబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. కథను కాస్త తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్చి రూపొందించనున్నారట.
అయితే ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్లో మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమార్ తండ్రీ కొడుకులుగా నటించారు. కానీ ఇక్కడ మాత్రం తండ్రీకొడుకుల థీమ్ చూపించట్లేదని తెలిసింది. బ్రదర్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందించేలా పాత్రలను డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెగా 157ను బింబిసార దర్శకుడు విశిష్ఠతో సోషియో ఫాంటసీగా చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.